విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి కృషి
గద్వాలటౌన్: విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక పాత హౌసింగ్‌బోర్డు కాలనీలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఏర్పాటు చేసిన పెన్షనర్ డే వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించేలా చూస్తామన్నారు. శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని, సుదీర్ణ కాలంగా సేవలందించిన తమ అనుభవాలను నేటితరం ఉద్యోగులు మార్గదర్శకంగా ఉపయోగించుకోవాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ విద్యుక్త ధర్మాన్ని పాటించే ఉద్యోగులు ఎల్లప్పుడు గుర్తుండిపోతారన్నారు. ప్రతి ఉద్యోగి తమ జీవిత కాలంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకుంటే ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. ఉద్యోగుల వైద్య చికిత్సలకు సంబంధించి కర్నూల్‌లో ఈహెచ్‌ఎస్ సౌకర్యం త్వరలోనే సాకారం అవుతుందని హామీ ఇచ్చారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో సైతం వైద్యసేవలు మెరుగు పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త పీఆర్సీని ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని, పాత పీఆర్‌సీ, డీఆర్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. అనంతరం పలువురు సీనియర్ విశ్రాంత ఉద్యోగులను ఎమ్మెల్యే శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరీ అధికారిణి గాయత్రి, ఏటీఓ వెంకట్‌రెడ్డి, సీనియర్ అధికారి మురళీ, విశ్రాంతి ఉద్యోగుల సంఘం నాయకులు చక్రధర్, హనుమంతు, బాలకిషన్‌రావు, రామన్‌గౌడ్, వీరవసంతరాయుడు, సవారన్న, బీసీరెడ్డి పాల్గొన్నారు.


