అలివిలవిల..
చేపపిల్లల విడుదల ఇలా..
సరిహద్దు సాకు..
కృష్ణానది తీరం వెంట తనిఖీలను ముమ్మరం చేస్తాం. కృష్ణానదిలో అలివి వలలతో చేపల వేటను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటాం. ఇందుకు ప్రధానంగా స్థానిక మత్స్యకారులు అధికారులకు సహకరించాలి.
– నర్సింహారావు, ఏడీ, మత్స్యశాఖ
కొల్లాపూర్: అలివి వలలతో చేపల వేట నిషేధం. అయినప్పటికీ కొందరు వ్యాపారులు తమ స్వలాభం కోసం కృష్ణానదిలో అలివి వలలతో వేట సాగిస్తూ.. చిన్న చేప పిల్లలను యథేచ్ఛగా పట్టేస్తున్నారు. ఫలితంగా సంప్రదాయ మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో అలివి వలలను పూర్తిస్థాయిలో నిషేధిస్తామని.. అవసరమైతే ఏపీ అధికారుల సమన్వయంతో అలివి వలలతో చేపల వేటను కట్టడి చేస్తామని ఇటీవల కొల్లాపూర్‌లో నిర్వహించిన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ సభలో రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. చాలాకాలంగా అలివి వలల వినియోగంపై మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికార యంత్రాంగంలో మాత్రం స్పందన కనిపించడం లేదు. కృష్ణానదిలో విచ్చలవిడిగా అలివి వలల వినియోగం జరుగుతోంది. దీనిపై ప్రజాప్రతినిధులు చెబుతున్న మాటలకు, అధికారులు చేతలకు పొంతన లేకుండాపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా కృష్ణానదిలో వదులుతున్న చేప పిల్లలను కొన్ని రోజుల్లోనే అలివి వలలతో పట్టేస్తుండటంతో క్రమేణా మత్స్య సంపద తగ్గుతూ వస్తోంది.
కృష్ణాతీరంలోనే గుడారాలు..
కొల్లాపూర్ నియోజకవర్గ సరిహద్దు గుండా కృష్ణానది ప్రవహిస్తోంది. వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలో ఉన్న కృష్ణానది తీరం వెంట పదుల సంఖ్యలో అలివి వలలతో చేపల వేట సాగించే వారి గుడారాలు ఉన్నాయి. చిన్నంబావి, పెంట్లవెల్లి, కొల్లాపూర్ మండలాల్లోని నది తీర ప్రాంతాల్లో విస్తృతంగా అలివి వలలతో చేపల వేట సాగుతోంది. వైజాగ్, కర్నూలు, కొల్లాపూర్ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు నదీ తీరంలోని పట్లు (చేపలు అధికంగా లభించే ప్రాంతాలు) కొనుగోలు చేసి దందా సాగిస్తున్నారు.
పర్యాటక ప్రాంతాల చెంతనే..
పర్యాటక ప్రాంతమైన సోమశిలకు నిత్యం జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తుంటారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు ఇక్కడికి రావడం.. కృష్ణానదిలో బోట్ల ద్వారా విహరించడం కనిపిస్తుంది. అయితే సోమశిలలోని టూరిజం కాటేజీలు, పుష్కరఘాట్ల వద్ద నుంచి కనుచూపు మేరలోనే అలివి వలలతో చేపల వేట సాగించే మత్స్యకారుల గుడారాలు ఉన్నాయి. నదీ తీరానికి రెండు వైపులా గుడారాలు, ఆరబెట్టిన చేపపిల్లలు కనిపిస్తాయి. కానీ, ఎవరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మంచాలకట్ట, మల్లేశ్వరం, జటప్రోల్, అమరిగిరిలోని నదీ తీర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా అలివి వలల గుడారాలే కనిపిస్తాయి. అలివి వ్యాపారులకు స్థానిక రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. అందుకే అటువైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కార్మికుల నిర్బంధం..
అలివి వలలు లాగేందుకు చాలామంది కార్మికులు అవసరం పడతారు. దీంతో వ్యాపారులు బలవంతంగా కార్మికులను ఇక్కడికి తీసుకొచ్చి నిర్బంధిస్తున్నారు. ఈ ఏడాది స్వచ్ఛంద సంస్థల జోక్యంతో 100 మందికిపైగా బాండెడ్ లేబర్‌కు విముక్తి కల్పించారు. అయినప్పటికీ కార్మికశాఖ అధికారులు ఎప్పుడు కూడా స్వయంగా వచ్చి తనిఖీలు చేసిన దాఖలాలు లేవు.
జిల్లాలోని నీటి వనరుల్లో ఈ ఏడాది 2.50 కోట్ల చేపపిల్లలను వదలాలని మత్స్యశాఖ నిర్ణయించింది. ఇప్పటి వరకు కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గ కేంద్రాల్లో చేపపిల్లల విడుదలను లాంచనంగా ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 23 లక్షల చేపపిల్లలను విడుదల చేశారు. సోమశిల వద్ద కృష్ణానదిలో మంత్రి జూపల్లి కృష్ణారావు 58 వేల చేపపిల్లలను వదిలారు. నదిలో 30 లక్షల చేపపిల్లలను వదిలేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కృష్ణానదిలో యథేచ్ఛగా సాగుతున్న చిన్నసైజు చేపల వేట
ఇలా వదిలితే.. అలా పట్టేస్తున్న అక్రమార్కులు
అటువైపు కన్నెత్తి చూడని అధికారులు
స్వయంగా మంత్రులు హెచ్చరించినా కనిపించని స్పందన
క్రమంగా తగ్గిపోతున్న మత్స్య సంపద
కృష్ణానది తెలంగాణ, ఏపీ సరిహద్దులో ప్రవహిస్తోంది. తాము తనిఖీలకు వెళ్లే సమయానికి అలివి గుడారాలను ఏపీ సరిహద్దులోకి మారుస్తున్నారంటూ తెలంగాణ అధికారులు చెబుతూ.. తమ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారు. సోమశిల, మల్లేశ్వరం, మంచాలకట్ట, వేంకల్, జటప్రోల్, అమరగిరి ప్రాంతాల్లో నెలల తరబడి గుడారాలు తెలంగాణ సరిహద్దులోనే ఉంటాయి. అధికారులు అనుకుంటే ఏ క్షణమైనా వారిని పట్టుకోవచ్చు. కానీ అలా జరగడం లేదు.
అలివిలవిల..
అలివిలవిల..


