‘ఉపాధి’ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర
గద్వాలటౌన్: మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, కొత్తగా తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిత మిషన్ పథకం వల్ల ప్రజలు, కార్మికుల వేతనాలు పెరగకుండా కేంద్రం అడ్డుకునే చర్యలకు పాల్పడుతుందని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఉప్పేర్ నర్సింహా, వీవీ నర్సింహా ఆరోపించారు. శుక్రవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నల్లబ్యాడ్జీలు ధరించి సీఐటీయూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత ఉపాధి పథకంలో నిధుల కోత పెట్టిందని, ప్రస్తుతం పేరు మార్చుతున్నారని మండిపడ్డారు. ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తన వాటాను 60 శాతానికి తగ్గించి, మిగిలిన 40 శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపడం అన్యామన్నారు. కేంద్ర ప్రభుత్వ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు నరేష్, బాబన్న, రామకృష్ణ, మల్లేష్, వీరేష్, వెంకటన్నపాల్గొన్నారు.


