జిల్లాను సందర్శించిన ట్రైనీ ఐపీఎస్‌లు
గద్వాల క్రైం: జిల్లాను నలుగురు ట్రైనీ ఐపీఎస్‌లు రాహుల్‌కాంత్, మానిషానెహ్రా, సోహం సునీల్, ఆయషా ఫాతిమా శుక్రవారం సందర్శించారు. ఈమేరకు మొదట ఎస్పీ శ్రీనివాసరావును కలిసి జిల్లాలో నమోదు అవుతున్న కేసులు, రాష్ట్ర సరిహద్దులు, జిల్లా భౌగోళిక విషయాలు, విద్యా, వైద్యం, సాగు, తాగునీటి, రాజకీయ అంశాలు, ప్రాచీన ఆలయాలు, సందర్శించే ప్రాంతాలు, పురాతన నిర్మాణాలు, ప్రాజెక్ట్‌లు, పోలీసు స్టేషన్‌లు తదితర విషయాలపై ఆరా తీశారు. అనంతరం వారు జోగుళాంబ ఆయలం, జిల్లా కేంద్రంలోని చేనేత కార్మికులను కలిసి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ఆ బాలవీరుల త్యాగం స్ఫూర్తిదాయం
గద్వాలన్యూటౌన్: జిల్లా కేంద్రంలోని బాల సదనంలో శుక్రవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీర్ బాల దివస్‌ను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు సమావేశంలో బాలల సంరక్షణ అధికారి నరసింహ మాట్లాడుతూ.. అతి చిన్న వయస్సులో స్వేచ్ఛ, ధర్మ పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన సాహిబ్ గురు గోబింద్ సింగ్ కుమారులు జోరవర్ సింగ్ (7 ఏళ్లు), బాబా ఫతే సింగ్ (9 ఏళ్లు)ల వీరత్వం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పారు. అతి చిన్న వయస్సులో వారు మొఘల్ పాలకుల ఆజ్ఞలకు లొంగకుండా, తమ ధర్మాన్ని కాపాడుకుంటూ వీరమరణం పొందారని, ఈ బాలవీరుల స్మారకంగా ఏటా డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్ నిర్వహిస్తున్నారని వివరించారు. చిన్నారులు ధైర్యంగా ఉండాలని సూచించారు. నైతిక విలువలు పాటిస్తూ ధర్మ మార్గంలో నడవాలని చెప్పారు. అనంతరం ఢిల్లీలో జరిగిన వీర్ బాల్ దివస్ కార్యక్రమాన్ని ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించారు. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సురేష్, బాలసదనం సూపరింటెండెంట్ వెంకటేశ్వరీ, సోషల్ వర్కర్ పద్మ, స్నేహ, నిర్మల బాలబాలికలు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ జట్ల ఎంపికలు
మన్ననూర్: స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయం క్రీడా మైదానంలో శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బ్యాడ్మింటన్ బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి వెంకటరామిరెడ్డి సమక్షంలో నిర్వహించిన పోటీల్లో గద్వాల, పెబ్బేరు, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, తెలకపల్లి, మన్ననూర్ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఉమ్మడి జిల్లా బాలబాలికల జట్లకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
జట్ల వివరాలు..
బాలుర జట్టుకు ప్రణీత్ (గద్వాల), రంజిత్ (పెబ్బేరు), ఎం.చరణ్ (గద్వాల), భాస్కర్ (పెబ్బేరు), మణికంఠ (అచ్చంపేట), సుదర్శన్ (గద్వాల), జి.చరణ్ (గద్వాల), మోహన్ (వనపర్తి), బాలికల జట్టుకు అక్షిత (మన్ననూర్), అను (పెబ్బేరు), కావేరి (మన్ననూర్), మేరీ (మన్ననూర్), రాధిక (మన్ననూర్), రేణుక (కల్వకుర్తి), మహాలక్ష్మి (కల్వకుర్తి), శ్రావణి (మన్ననూర్), సమారిన్ బేగం (గద్వాల), యశస్విని (తెలకపల్లి) ఎంపికై నట్లు నిర్వాహకులు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ రూపాదేవి, అలీం, చుక్క చంద్రశేఖర్, డా.నరేందర్‌రెడ్డి, శ్యామ్, బాబునాయక్, పీఈటీలు అస్మత్, అనిత, స్నేహ పాల్గొన్నారు.
ముగిసిన రాష్ట్రస్థాయి హాకీ పోటీలు
వనపర్తి రూరల్: మండలంలోని కడుకుంట్ల క్రీడా మైదానంలో కొనసాగిన ఎస్‌జీఎఫ్ అండర్–14 బాలికల రాష్ట్రస్థాయి హాకీ పోటీలు శుక్రవారం ముగిశాయి. చివరి మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టుపై నిజామాబాద్ జట్టు 1–0 గోల్స్‌తో విజయం సాధించింది. ప్రథమ స్థానంలో నిజామాబాద్, ద్వితీయ స్థానంలో మహబూబ్‌నగర్, మూడో స్థానంలో హైదరాబాద్ జట్లు నిలిచాయని ఎస్‌జీఎప్ కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.నిరంజన్‌గౌడ్ తెలిపారు. గ్రామంలో హాకీ క్రీడలు నిర్వహించడానికి సహకరించిన గ్రామస్తులు, యువతకు కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లాను సందర్శించిన ట్రైనీ ఐపీఎస్‌లు


