పెరిగిన చోరీలు..!
మరికొన్ని కేసులు, రికవరీలు..
సైబర్ నేరాలు రెట్టింపు.. రోడ్డు ప్రమాదాలు, అత్యాచార కేసులు సైతం పెంపు
గద్వాల క్రైం: జిల్లాలో గతేడాదితో పోల్చితే చోరీ కేసులు.. సైబర్ నేరాలు.. అత్యాచార కేసులు.. రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించి తగు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. పలు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 135 మంది దుర్మరణం చెందగా.. 189 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఏడాది మొత్తంగా 2,410 కేసులు నమోయ్యాయని, గతేడాది నమోదైన 2703 కేసులతో పోల్చితే కొంత కేసుల శాతం తగ్గిందని ఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం వార్షిక నేర సమీక్షలో వెల్లడించారు. ఇక చోరీ కేసుల్లో 67 శాతం సొమ్ము రికవరీ చేశామని, దొంగల ముఠాలను, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పలు హత్య కేసులను ఛేదించి నిందితులను పట్టుకున్నామని తెలిపారు. ఇదిలాఉండగా, జిల్లాలో సుపారీగ్యాంగ్ హత్యలు.. చోరీ ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. ముఖ్యంగా జూలై 12న అయిజలోని ఓ గోదాం షట్టర్లు పగలగొట్టి రూ.18 లక్షల విలువ చేసే సిగరెట్ల చోరీ.. జూన్ 5న గద్వాల వ్యవసాయ మార్కెట్‌లో నిలిపి ఉంచిన రూ.25 లక్షల విలువైన 10 టైర్ల లారీ అపహరణ.. ఆగస్టు 17న జిల్లా కేంద్రంలో హమాలీకాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడి 16 తులాల బంగారు ఆభరణాలను దొంగలు చోరీ చేయడంతో ప్రజలకు కంటిమీద కునుకు కరువైంది.
సైబర్ నేరాలు రెట్టింపు
జిల్లాలో గతేడాది 161 దొంగతనాలకుగాను రూ.1.94 కోట్లు చోరీ అయ్యింది. ఇందులో రూ.63 లక్షలు రికవరీ చేశారు. ఈ ఏడాది 184 దొంగతనాలకుగాను రూ.1.43 కోట్లు చోరీ అయ్యింది. ఇందులో రూ.96 లక్షలు రికవరీ చేశారు. ఇక సైబర్ నేరాల విషయానికి వస్తే.. స్వల్పంగా పెరిగాయి. గతేడాది 50 కేసులు కాగా.. ఈ ఏడాది 95 నమోదయ్యాయి. ఈ 95 కేసుల్లో రూ.2.60 కోట్లు అపహరించగా.. సాంకేతికతను ఉపయోగించి బ్యాంక్ ఖాతాల నుంచి రూ.47,62లక్షల నగదును ఫ్రీజ్ చేశారు. రూ.11.24లక్షల నగదును రికవరీ చేశారు. ఇక రోడ్డు ప్రమాదాలు సైతం స్వల్పంగా పెరిగాయి. మొత్తం 204 రోడ్డు ప్రమాదాల్లో 135 మంది మృతి చెందారు. జిల్లాలో తొలి వైట్‌కాలర్ కేసు నమోదైంది. నందిన్నె రైసుమిల్లు యాజమాని మిల్లు వీరన్న రూ.40 కోట్ల ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు విజెలెన్స్ అధికారుల దాడుల్లో బయటపడింది. ఈమేరకు కేటీదొడ్డి పోలీసు స్టేషన్‌లో అధికారులు ఫిర్యాదు చేయగా.. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
హత్య కేసుల ఛేదన
జిల్లాలో సంచలనం సృష్టించిన పలు హత్య కేసులను పోలీసులు ఛేదించారు. ప్రధానంగా నవంబర్ 21న కేటీదొడ్డి మండలం నందిన్నెకు చెందిన మాజీ సర్పంచ్ బీమరాయుడు హత్య.. జూన్ 15న గద్వాలకు చెందిన ఓ ప్రైవేటు సర్వేయర్ హత్య.. ఏప్రిల్ 17న కేటీదొడ్డి మండలం గంగన్‌పల్లి హత్య.. ఫిబ్రవరి 12న వడ్డేపల్లి మండలం తనగాలకి చెందిన రమేష్ హత్యలు సంచలనం సృష్టించాయి. ఈ హత్య కేసులను పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకుని ఛేదించి నిందితులను కటకటాల్లోకి పంపించారు.
కేటగిరీ నమోదైన కేసులు
2024 2025
బీఎన్‌ఎస్ యాక్టు 1052 846
రోడ్డు ప్రమాదాలు 194 204
దొంగతనాలు 161 184
మిస్సింగ్ 187 177
ఇసుక రవాణా 133 112
సైబర్ క్రైమ్ 50 95
గ్రేవ్ కేసులు 69 92
చీటింగ్ 169 77
పేకాట 35 64
పోక్సో 44 51
మహిళా వేధింపులు 196 50
అత్యాచారం 31 41
రేషన్ బియ్యం 53 40
ఎస్సీ, ఎస్టీ 40 32
హత్యలు 10 10
ఎన్‌డీపీఎస్ యాక్టు 4 5
ఇతర కేసులు 325 425
నమోదైన మొత్తం కేసులు 2,410
గతేడాదితో పోల్చితే 293 కేసులు
తగ్గుదల
జిల్లా వార్షిక నేర సమీక్షలో
ఎస్పీ శ్రీనివాసరావు
లోక్ అదాలత్ ద్వారా 22,426 కేసులు పరిష్కారం
985.8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం
స్వాధీనం
గేమింగ్ యాక్టు కేసులో రూ.7.75 లక్షలు స్వాధీనం
7056 డ్రంకెన్ డ్రైవ్ కేసులకుగాను రూ.33.96 లక్షలు జరిమానా వసూలు
మోటార్ వెహికిల్ యాక్టు ద్వారా 1.05 లక్షల కేసులకుగాను జరిమానా రూపంలో రూ.6.49 కోట్లు వసూలు
పెరిగిన చోరీలు..!
పెరిగిన చోరీలు..!
పెరిగిన చోరీలు..!


