నట్టల నివారణతో జీవాలు సురక్షితం
● జిల్లాలో ఇప్పటివరకు 35 శాతం
మందుల పంపిణీ
గద్వాలవ్యవసాయం: జీవాల్లో (గొర్రెలు, మేకలు) నట్టలు ఏర్పడకుండా ముందస్తుగా వాటికి ఉచిత నివారణ మందులు వేసే కార్యక్రమం జిల్లాలో కొనసాగుతోంది. పశుసంవర్ధకశాఖ ఈనెల 22 నుంచి ఆరంభించింది. ఇప్పటి వరకు 35శాతం పూర్తి అయ్యింది. జీవాల్లో నట్టలు.. బాహ్య, అంతర్ పరాన్నజీవులుగా నట్టలు రెండు రకాలుగా ఉంటాయి. అంతర్ పరాన్న జీవులు (నులిపురుగులు, పొట్టజలగలు, బద్దెపురుగులు) బాహ్య పరాన్న జీవులు (టిక్స్, ఫ్‌లైస్,మైక్స్)ను నట్టలు అని పిలుస్తారు. నట్టలు ప్రధానంగా వర్షాకాలం, చలికాలంలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఏర్పడతాయి. ఈ వ్యాదిగ్రస్థ జీవాలు ఆరుబయట మేతపైన కాని, తాగునీటిపైన కానీ మల విసర్జనచేస్తే.. ఆ మేతను తిన్న, ఆనీటిని తాగిన ఇతర ఆరోగ్యకరమైన జీవాల్లో కూడా నట్టలు ఏర్పడతాయి. నట్టలు ఏర్పడితే జీవాలు మేత తినక బలహీనంగా మారుతాయి. తర్వాత రక్తహీనతకు గురి అయి తీవ్ర అనారోగ్యానికి గురి అవుతాయి. బరువు తగ్గిపోతాయి. కొన్ని సందర్బాల్లో మృతి చెందుతాయి.
కొనసాగుతున్న కార్యక్రమం
పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందులు వేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ప్రతి బృందంలో పశువైద్యాధికారి, పార్యవేట్ ఉన్నారు. వీరు ఆయా గ్రామాల్లో ముందస్తుగా పెంపకందారులకు సమాచారం అందించి జీవాలకు నట్టల నివారణ మందులను వేస్తున్నారు. జిల్లాలో 5,40,650 గొర్రెలు ఉండగా 1,28,165 వాటికి, 65,355 మేకలు ఉండగా 10,784 వాటికి ఇప్పటి వరకు వేసినట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నట్టల నివారణ కార్యక్రమం మరో వారం రోజుల పాటు నిర్వహిస్తామని, పెంపకందారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


