పద్యకృతుల ఆవిష్కరణ మహోత్సవం
స్టేషన్ మహబూబ్‌నగర్: జాతీయ సాహిత్య పరిషత్ పాలమూరు జిల్లాశాఖ ఆధ్వర్యంలో ప్రముఖ కవి రాచాలపల్లి బాబుదేవిదాస్‌రావు రచించిన ‘రామచంద్ర ప్రభో’, ‘చిత్రాంగద– సారంగధరుడు’ పద్యకృతుల ఆవిష్కరణ మహోత్సవాన్ని గురువారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు. జాతీయ సాహిత్య పరిషత్ జిల్లాశాఖ అధ్యక్షుడు ఇరివింటి వెంకటేశ్వరశర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ సాహిత్యం జగద్వితం కోసం సృష్టించబడుతుందన్నారు. కవులు సమాజ హితాన్ని కోరుకుంటారని తెలిపారు. ముఖ్య అతిథి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రామచంద్ర ప్రభో కావ్యం సరళమైన, సుందరమైన సుమధుర తెలుగు భాషలో అందించినట్లు తెలిపారు. ఇందులో ప్రాచీన కవుల గుంబనం, లలిత పదజాతం ఆకట్టుకుంటుందన్నారు. రామచంద్రప్రభో మకుటంతో ఆద్యంతం పద్యాలను ఎంతో శ్రావ్యంగా చదువుతూ బాబుదేవిదాసును అభినందిస్తూ సమీక్ష చేశారు. డాక్టర్ పొద్దుటూరు ఎల్లారెడ్డి రామచంద్రప్రభో మకుటం ఉన్న 131 పద్య కావ్యాన్ని, పద్యాలను చదువుతూ రామ కథను అసాంతం పరిచయం చేశారు. డాక్టర్ తంగెళ్లపల్లి శ్రీదేవి చిత్రాంగద–సారంగధరుడు కథను 126 ప్యదాల కృతిని సమీక్ష చేస్తూ చక్కగా వివరించారు. అదేవిధంగా ప్రముఖ న్యాయవాది వి.మనోహర్‌రెడ్డి, అవధాని చుక్కాయపల్లి శ్రీదేవి, డాక్టర్ కె.బాలస్వామి, తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాలు రావూరి వనజ పద్యకృతులపై ప్రసంగించారు. పాలమూరు నగర అధ్యక్షులు జి,శాంతారెడ్డి, కవులు ప్రభులింగంశాస్త్రి, దేవదానం, రవీందర్‌రెడ్డి, ఖాజా మైనొద్దీన్, జగపతిరావు, గడ్డం వనజ, డాక్టర్ కృష్ణవేణి, జమున, ఈశ్వరమ్మ, గుముడాల చక్రవర్తి, శ్యాంప్రసాద్, అనురాధ, వీరేందర్‌గౌడ్, శ్రీరాములు పాల్గొన్నారు.


