బంగ్లాదేశ్‌లో హింసాకాండకు వ్యతిరేకంగా ఆందోళన
గద్వాలటౌన్: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై గద్వాలలో నిరసన వ్యక్తమైంది. గురువారం సాయంత్రం వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్, బీజేపీ సంయుక్త ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక కోటలోని ఆలయం నుంచి నిరసన ప్రదర్శన చేపట్టారు. బంగ్లాదేశ్‌లో జిహాదీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం స్థానిక కృష్ణవేణి చౌరస్తాలో బంగ్లాదేశ్ దేశ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు అల్లూరి ఫణిమోహన్‌రావు, ధర్మ ప్రసార సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై కొనసాగుతున్న దాడులను అడ్డుకునేందుకు కేంద్రం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. హిందువులపై జరుగుతున్న హింసాకాండను దేశ ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలన్నారు. బంగ్లాదేశ్‌లో జిహాదీ శక్తుల నుంచి హిందువులకు రక్షణ కల్పించాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు ఒక్కతాటిపైకొచ్చి బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మతోన్మాదుల దాడిలో మృతిచెందిన దీప్ చంద్రదాస్‌కు నివాళులర్పించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు రామంజనేయులు, బండల వెంకట్రాములు, భాస్కర్, తిరుపతి, నర్సింహా, మణికృష్ణ, శ్రీకాంత్, జనార్థన్, మనోజ్, జయశ్రీ, రమాదేవి, శ్యామ్, దేవదాసు తదితరులు పాల్గొన్నారు.


