ఆదిశిలా క్షేత్రంలో జడ్జీల ప్రత్యేక పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం జిల్లా సీనియర్ సివిల్ జడ్జీ లక్ష్మి, వనపర్తి జిల్లా ప్రిన్సిపల్ సబ్‌కోర్టు జడ్జీ కళార్చన వేర్వేరుగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ నిర్వాహకులు అరవిందరావు, అర్చకులు వారికి సాదర స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ విశిష్టతలను వివరించి స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి మెమోంటో అందజేశారు. వారి వెంట ఆలయ నిర్వాహకులు చంద్రశేఖరరావు, అర్చకులు మధుసూధనాచారి, రమేషాచారి, రవిచారి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కోయిల్‌సాగర్ నీటి విడుదల షెడ్యూల్ ఖరారు
దేవరకద్ర: ప్రస్తుత యాసంగి సీజన్‌లో కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలకు షెడ్యూల్ ఖరారు చేశారు. కలెక్టరేట్‌లో మంగళవారం సాగునీటి సలహా మండలి సమావేశం కలెక్టర్ విజయేందిర, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా ఇరిగేషన్‌శాఖ అధికారులు, ఆయకట్టు రైతులతో చర్చించి నీటి విడుదల చేసే తేదీలను ఖరారు చేశారు. ప్రాజెక్టు పాత ఆయకట్టు కింద కుడి, ఎడమ కాల్వలకు నీటిని వదులుతారు. గతేడాది రూపొందించిన షెడ్యూల్‌లో తేదీలను అటు ఇటుగా మార్చి అయిదు తడులుగా నీటిని వదలడానికి నిర్ణయించారు.
రెండేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల వడ్డీ చెల్లించాం
వనపర్తి: గడిచిన 64 ఏళ్లలో 22 మంది సీఎంలు రూ.63 వేల కోట్ల అప్పు చేస్తే.. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని.. ఆయన చేసిన అప్పుల కోసం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.1.50 లక్షల కోట్లు వడ్డీ చెల్లించామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన వనపర్తిలో విలేకరులతో మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల డీపీఆర్‌కు కేంద్రం అనుమతి లభించలేదనే విషయం పక్కన పెడితే.. ఉమ్మడి పాలమూరులో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన, నిధులు వెచ్చించింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనేనని పునరుద్ఘాటించారు. సాగునీటి ప్రాజెక్టుల పేరిట బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన దోపిడి, అధికారం కోల్పోయాక చేస్తున్న అబద్ధపు ఆరోపణలపై నూతనంగా ఎన్నికై న సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలతో నిజాలు సవివరింగా చర్చించాలని సూచించారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన జనమంచి గౌరీశంకర్ (గౌరీజీ) పేరిట ఏటా అందజేసే యువ పురస్కార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరేష్‌తేజ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాజంపై సానుకూల ప్రభావం చూపే సేవా కార్యక్రమాలు, నూతన ఆవిష్కరణలు, ప్రముఖ రంగాల్లో విశేష కృషి చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలిచే జాతీయ భావాలు కలిగిన 40 ఏళ్లలోపు వారు అర్హులన్నారు.


