భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు
గద్వాలటౌన్: క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గురువారం జిల్లా పరిధిలోని ఆయా చర్చిలలో వేడుకల సందర్భంగా చర్చిలను అందంగా తీర్చిదిద్దారు. చర్చి పాస్టర్లు, మత పెద్దలు, ఇతర రాజకీయ నాయకులు వేరువేరుగా జిల్లా కేంద్రంతోపాటు మండలాల పరిధిలోని పలు చర్చిలలో పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయా చర్చిలలోని పాస్టర్లు సందేశాన్ని ఇచ్చారు. ప్రేమ, కరుణలతో ప్రపంచాన్ని జయించవచ్చని తెలిపి సర్వ మానవాళికి శాంతి సందేశాన్ని వినిపించిన యేసు ప్రభువును ప్రతి ఒక్కరూ అనుసరించాలని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇదిలాఉండగా, క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా చర్చిలు రంగురంగుల విద్యుద్దీపాలతో తేజరిల్లాయి. ప్రపంచానికి శాంతి సందేశం అందించిన యేసుక్రీస్తు ఆగమనవేళ.. జిల్లా అంతటా చర్చిలు ప్రార్థనలతో ప్రతిధ్వనించాయి. బుధవారం అర్థరాత్రికి ముందే చర్చిలన్నీ విద్యుద్దీపాలంకరణ నడుమ సందడిగా మారాయి. బాలయేసును స్వాగతించడానికి చిన్నా, పెద్ద అంతా ఉత్సాహంగా ఎదురుచూశారు. ‘పరిశుద్ధాత్ముని కృప వల్ల అంతా శుభమే జరగాలంటూ’ మత పెద్దలు ఆకాంక్షించగా, భక్తులంతా జీసస్‌కు జేజేలు పలికారు. పొద్దు పోయేదాక క్రిస్మస్ వేడుకలను ఆనందోత్సహాలతో జరుపుకొన్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత వివిధ పార్టీల నాయకులు వేర్వేరుగా పలు చర్చిలలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు


