గాంధీ ప్రతిష్టను తగ్గించడానికే పేరు తొలగింపు | - | Sakshi
Sakshi News home page

గాంధీ ప్రతిష్టను తగ్గించడానికే పేరు తొలగింపు

Dec 26 2025 8:21 AM | Updated on Dec 26 2025 8:21 AM

గాంధీ

గాంధీ ప్రతిష్టను తగ్గించడానికే పేరు తొలగింపు

డీసీసీ కార్యాలయ ప్రారంభంలో వీహెచ్‌

కార్యక్రమానికి సంపత్‌, సరిత

వర్గీయులు దూరం

గద్వాలటౌన్‌: జాతిపిత మహాత్మాగాంధీ ప్రతిష్టను తగ్గించడం కోసమే ఉపాధి హామీ పథకానికి ఆయన పేరును తొలగించారని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు వీ.హనుమంతురావు ఆరోపించారు. గద్వాలలోని రాజీవ్‌మార్గ్‌ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీసీ కార్యాలయాన్ని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు వీ హనుమంతురావు గురువారం ప్రారంభించారు. డీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన రాజీవ్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే రాజీవ్‌రెడ్డిని పలువురు నాయకులు వేర్వేరుగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వీహెచ్‌ మాట్లాడారు. ఉపాధి పథకానికి గాంధీ పేరు తొలగింపు చర్య దేశ ప్రతిష్టకు భంగం కలిగించే అంశమన్నారు. పేదల కడుపు నింపే లక్ష్యంతో యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పఽథకాన్ని తెచ్చిందన్నారు. ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించడానికి చట్టసభల నుంచి అన్ని స్థాయిల్లో ప్రయత్నం చేయటం జరుగుతుందన్నారు. చివరిగా ప్రజా కోర్టులో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

ప్రజా బంగ్లాగా డీసీసీ కార్యాలయం

నడిగడ్డలో నడుస్తున్న బంగ్లా రాజకీయాలకు రోజులు దగ్గర పడ్డాయని.. ఇప్పుడు డీసీసీ కార్యాలయమే ప్రజా బంగ్లాగా ప్రజలకు అండగా ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి పేర్కొన్నారు. బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. డీసీసీ కార్యాలయానికి ప్రజా బంగ్లాగా నామకరణం చేస్తున్నామని చెప్పారు. ప్రజా బంగ్లా ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్తది అన్నారు. నడిగడ్డలో ఎవరికి ఇబ్బందులు కలిగిన ప్రజా బంగ్లాకు వస్తే న్యాయం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రాధాన కార్యదర్శి మిథున్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ తదితరులు సన్మానించిన వారిలో ఉన్నారు. అంతకుముందు డీసీసీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ జెండాను ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్‌ ఆవిష్కరించారు.

సంపత్‌, సరిత వర్గీయులు దూరం

డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి సరిత దూరంగా ఉన్నారు. వారి వర్గీయులు సైతం కార్యక్రమానికి హాజరు కాలేదు. సంపత్‌, సరిత వర్గీయులు ఇరువురు గద్వాలలో ఉన్నప్పటికి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాకపోవడంపై చర్చ మొదలైంది. ఫ్లెక్సీలలో ఫొటోలు వేయలేదనే చర్చ సైతం జరుగుతుంది. ఉద్దేశ్య పూర్వకంగానే ప్రమాణ స్వీకారానికి తమను పిలవలేదని, బంగ్లా డైరెక్షన్‌లోనే డీసీసీ అధ్యక్షుడు పనిచేస్తున్నారని సరిత వర్గీయులు ఆరోపించారు. అయితే ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మినహా ఆయన వర్గీయులు ప్రమాణ స్వీకారానికి హాజరై, రాజీవ్‌రెడ్డిని పూలమాలలతో సన్మానించారు. గద్వాలలో కాంగ్రెస్‌ పార్టీ మూడు గ్రూపులుగా చీలిపోయిందనే చర్చ సాగుతోంది.

గాంధీ ప్రతిష్టను తగ్గించడానికే పేరు తొలగింపు 1
1/1

గాంధీ ప్రతిష్టను తగ్గించడానికే పేరు తొలగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement