రైతులను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
ఉండవెల్లి: రైతులు రెక్కలు ముక్కలు చేసుకొని సాగుచేసిన పంటలను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని, రైతులను అసలు పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే విజయుడు ఆరోపించారు. గురువారం మండలంలోని బొంకూరులో మొక్కజొన్న పంట విక్రయానికి వెళ్లి కొనుగోలు కేంద్రం వద్దే మృతిచెందిన జమ్మన్న ఇంటికి వెళ్లి రైతు మృతదేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు పంటను విక్రయించడానికి వెళ్లి రోజుల తరబడి పడిగాపులు కాచాడని, చలికి ఎండకు కేంద్రం వద్దే గుండెపోటుతో మృతిచెందడంపై ప్రభుత్వ నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనబడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముమ్మాటికి రైతు మృతికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అన్నారు. ఆయన వెంట బొంకూరు సర్పంచు దేవన్న, బీఆర్‌ఎస్ నాయకులు గజేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, భరత్ కుమార్ రెడ్డి, పల్లయ్య, చంద్రన్న, సురేష్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, రంగస్వామి ఉన్నారు.


