ప్రజావాణికి అర్జీల వెల్లువ
గద్వాలటౌన్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి అర్జీలు వెల్లువెత్తాయి. కలెక్టర్‌కు సమస్యలను తెలియజేస్తే పరిష్కారమవుతాయనే ఉద్దేశంతో జిల్లా నలుమూలల నుంచి బాధితులు భారీగా తరలివచ్చారు. అర్జీదారులతో కలెక్టరేట్ ప్రాంగణం కిటకిటలాడింది. ప్రజావాణిలో కలెక్టర్ బీఎం సంతోష్, అడిషినల్ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం కొనసాగగా.. వివిధ సమస్యలపై 141 అర్జీలు అందాయి. ఇందులో 106 అర్జీలు డబుల్‌బెడ్రూం ఇళ్లకు సంబంధించినవి ఉన్నాయి. మిగతావి చేయూత పింఛన్లు, భూ సంబంధిత సమస్యలు, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, ఉపాధి, విద్యుత్ తదితర సమస్యలపై వినతులు అందాయి. అధికారులు బాధితుల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి.. వారి సమస్యలను ఓపికతో విన్నారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించొద్దని కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులకు సూచించారు.


