పేదల సొంతింటి కల సాకారం
ధరూరు: పేదల ఎన్నో ఏళ్ల సొంతింటి కలను సాకారం చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికే దక్కిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన అల్వాలపాడు గ్రామంలో మండలంలోనే మొట్ట మొదట నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇంటిని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రాంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ఇంటి యజమానుల బ్యాంకు ఖాతాలోనే దశల వారిగా రూ.5 లక్షలు జమ చేస్తోందన్నారు. నియోజకవర్గానికి మొత్తం 3,500 ఇళ్లు మంజూరయ్యాయని, వీటిని లబ్ధిదారులు వీలైనంత త్వరగా పూర్తిచేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డితోపాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామంలోని మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు. మహిళా సంఘాలలో ఉన్న ప్రతి మహిళకు చీర అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిండమే కాకుండా అనేక రకాలుగా లబ్ధి చేకూరుస్తోందని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణనాయుడు, మాజీ సర్పంచ్ వీరన్నగౌడ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


