నందిన్నె చెక్‌పోస్టు తనిఖీ
కేటీదొడ్డి: మండలంలోని నందిన్నె చెక్‌పోస్టును ట్రెయినీ కలెక్టర్ మనోజ్‌కుమార్‌రెడ్డి తనిఖీ చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన చెక్‌పోస్టు వద్దకు చేరుకొని అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులతో మాట్లాడారు. చెక్‌పోస్టులో నిర్వహించే తనిఖీల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం గ్రామ పంచాయతీ వద్ద నిర్వహిస్తున్న వైద్య సిబ్బందితో మాట్లాడారు.
ఫిర్యాదులు పరిశీలించి పరిష్కరిస్తాం
● ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్
స్టేషన్ మహబూబ్‌నగర్: డయల్ యువర్ ఆర్టీసీ ఆర్‌ఎంకు వచ్చిన సలహాలు, ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తామని రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్ అన్నారు. డయల్ యువర్ ఆర్‌ఎం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు రీజినల్ పరిధిలోని ఆర్టీసీ ప్రయాణికుల నుంచి ఆర్‌ఎం సలహాలు, ఫిర్యాదులను స్వీకరించారు. మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్ రూట్లో శంకరాయపల్లి వద్ద బస్సులు, మహబూబ్‌నగర్‌లోని భగీరథకాలనీ వద్ద బస్సులు ఆపాలని ప్రయాణికులు ఫోన్‌లో కోరారు. ఉదయం సమయంలో కోస్గి నుంచి మహబూబ్‌నగర్ మీదుగా లింగచేడ్, కొమ్మురు, కోయిలకొండకు బస్సులు నడపాలని, గద్వాల బస్సును అల్లపాడు నుంచి మానవపాడు ఎక్స్‌రోడ్ వరకు పొడిగించాలని కోరారు. కొల్లాపూర్ నుంచి శ్రీశైలం వరకు నేరుగా బస్సు సర్వీసు నడపాలని విజ్ఞప్తి చేశారు.


