విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకోవాలి
గద్వాలటౌన్: జిల్లాలో చిన్నారుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, పిల్లలు బాగా చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని ఐడీఓసీ సమావేశపు హాల్‌లో బాలల హక్కుల వారోత్సవ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్నారులకు అభ్యాసం, వారి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం గుణాత్మక విద్య, పౌష్టికామారంతోపాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. నేటి పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనాథ పిల్లలకు బాలసదనం భద్రతగా, సురక్షితంగా ఉంటుందన్నారు. పిల్లలు ఎవరూ కూడా అధైర్యపడద్దొని, మీ అభ్యున్నతికి మేం ఎల్లప్పుడూ తోడుంటామని చెప్పారు. అనంతరం ఆటల పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి సునంద, డీఈఓ విజయలక్ష్మి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ నుషిత, డీఎంఅండ్‌హెచ్‌ఓ సంధ్య కిరణ్మయి, జిల్లా ప్రొబిషన్ అధికారి పరుశరాం, సీడబ్ల్యూసీ చైర్మన్ సహదేవుడు, సభ్యురాలు శైలజ, కోఆర్డినేటర్ నర్సింహా, జువైనల్ జస్టీస్ బోర్డు సభ్యురాలు గ్రేసి తదితరులు పాల్గొన్నారు.


