
భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి
గద్వాల: నెట్టెంపాడు ప్రాజెక్టు కింద చేపట్టాల్సిన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నెట్టెంపాడు ప్రాజెక్టులోని 99, 100 ప్యాకేజీల కింద కుడి కాలువ పరిధిలో చేపట్టాల్సిన భూసేకరణ పనులు సకాలంలో పూర్తి చేసి రైతులకు పరిహారం అందించాలన్నారు. రైతులకు బకాయిలేని విధంగా మొత్తం పరిహారం చెల్లింపులు చేయాలన్నారు. అభ్యంతరాలు వ్యక్తం చేసే రైతులకు వివరించి ఒప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, భూసేకరణ డిప్యూటీ కలె క్టర్ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఎస్‌ఈ రహీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
వృద్ధులకు రక్షణగా చట్టాలు
వయో వృద్ధుల సంరక్షణలో సమస్యలు తలెత్తితే చట్టపరంగా వారి పోషకులపై చర్యలు చేపట్టేందుకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. వృద్ధాప్యంలో ఉన్న వారికి ఇబ్బందులు కలగజేయకుండా వారి పోషణ పూర్తి బాధ్యత పిల్లలే చూడాలని, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పోషణలో నిర్లక్ష్యం వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఫిర్యాదులను ట్రిబ్యూనల్ ద్వారా 90–120రోజుల్లో పరిష్కరించబడతాయని, వారి పోషణ, వైద్యం కోసం కనీసం నెలకు రూ.10వేలు భృతి అందించాలని తెలిపారు. చట్టాన్ని అతిక్రమించేవారికి మూడునెలల జైలుశిక్ష, లేదా రూ.5వేల జరిమానా విధించబడుతుందని, ఆస్తి బదిలీ రద్దు చేయబడుతుందని తెలిపారు.