సీఎం ఇలాకాలో భూసేక‘రణం’! | - | Sakshi
Sakshi News home page

సీఎం ఇలాకాలో భూసేక‘రణం’!

Aug 30 2025 7:42 AM | Updated on Aug 30 2025 7:42 AM

సీఎం

సీఎం ఇలాకాలో భూసేక‘రణం’!

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: కొడంగల్‌–నారాయణపేట ఎత్తిపోతల పథకానికి గ్రహణం వీడడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్ట్‌కు రూపకల్పన జరిగినా.. అప్పుడు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనూ అనేక అవాంతరాలతో అడుగు ముందుకు పడలేదు. ఎట్టకేలకు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. ఈ పథకం అమలుకు కృషి చేసిన ఉమ్మడి పాలమూరుకు చెందిన రేవంత్‌రెడ్డి సీఎం కావడంతో ఈ ఎత్తిపోతలు మళ్లీ పురుడు పోసుకున్నాయి. అయితే.. పరిహారం పెంచాలనే డిమాండ్‌తో భూ నిర్వాసితులు చేపట్టిన ఆందోళనలు మిన్నంటుతున్నాయి.

ఉమ్మడి ఏపీలో రూపకల్పన..

నారాయణపేట, మక్తల్‌, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలో 1.05 లక్షల ఎకరాలకు సాగు నీరు.. 5.50 లక్షల జనాభాకు తాగు నీరందించాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. రూ.1,450 కోట్ల అంచనా వ్యయంతో 2014లో జీఓ 69తో పరిపాలన అనుమతులు జారీ చేశారు. రూ.133 కోట్ల నిధులు విడుదల చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అప్పటికే నిర్మించిన రాజీవ్‌ భీమా ఎత్తిపోతల పథకానికి కేటాయించిన నికర జలాలను ఈ ఎత్తిపోతలకు వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

డిజైన్‌లో మార్పు.. అయినా..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగా.. జీఓ 69అమలు కోసం రైతులు, మేధావులు, ప్రతిపక్షాలు, జలసాధన సమితి నేతలు ఉద్యమాలు చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం ఈ పథకం డిజైన్‌ మార్చింది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నిర్మిస్తున్న ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ ద్వారా నారాయణపేట, కొడంగల్‌ సెగ్మెంట్లలో 1.80 లక్షల ఎకరాలకు సాగు నీరందేలా ప్రణాళికలు రూపొందించినా.. అమలుకు నోచుకోలేదు.

ఎట్టకేలకు గత ఏడాది శంకుస్థాపన..

2023లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగా.. పాత డిజైన్‌ ప్రకారం కొడంగల్‌–నారాయణపేట ఎత్తిపోతలకు మళ్లీ అడుగు పడింది. రూ.4,369 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 21న అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి కోస్గిలో నిర్వహించిన బహిరంగసభలో ప్రకటించడంతో పాటు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు జూరాల బ్యాక్‌ వాటర్‌ నుంచి నాలుగు టీఎంసీల నీటిని నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతలకు వినియోగించనున్నారు.

2 ప్యాకేజీలుగా పనులు..

ఎత్తిపోతల్లో భాగంగా నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలంలోని భూత్పూర్‌ నుంచి కానుకుర్తి చెరువు వరకు రెండు ప్యాకేజీల్లో అప్రోచ్‌ కాల్వలు, పంప్‌హౌస్‌లు, ప్రెషర్‌ మెయిన్లు, లీడ్‌ చానెల్‌, డెలివరీ సిస్టర్న్‌లతో పాటు సివిల్‌, ఎలక్ట్రిక్‌ పనులు చేపట్టనున్నారు. మొదటి ప్యాకేజీకి రూ.1,134.62 కోట్లు, రెండో ప్యాకేజీకి రూ.1,126.23 కోట్లు.. మొత్తం రూ.2,260.85 కోట్లు కేటాయించారు. మొత్తంగా 207 మెగావాట్ల సామర్థ్యం గల ఏడు పంప్‌లు ఏర్పాటు చేయనున్నారు.

‘కొడంగల్‌–నారాయణపేట’కు అడుగడుగునా అడ్డంకులు

భూసేకరణ లక్ష్యం 1,957 ఎకరాలు

3 నెలల్లో సేకరించింది 597 ఎకరాలే..

కాట్రేవులపల్లి నుంచి కానుకుర్తి వరకు మిన్నంటిన నిరసనలు

పరిహారం పెంచే వరకూ ఆందోళనలు తప్పవని రైతుల హెచ్చరిక

350 మందికి పరిహారం..

తొలి రెండు ప్యాకేజీల పనుల కోసం నారాయణపేట జిల్లాలోని మక్తల్‌, నారాయణపేట నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1,957 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ఏడాది జూన్‌లో సేకరణ చేపట్టగా.. ఇప్పటివరకు 590 ఎకరాల్లో మాత్రమే సర్వే పూర్తయింది. 134 ఎకరాలకు సంబంధించి అధికారులు 350 మంది రైతులకు ఎకరాకు రూ.14 లక్షల చొప్పున పరిహారం అందజేశారు.

తొలి రెండు ప్యాకేజీల్లో మక్తల్‌, నారాయణపేట నియోజకవర్గాల పరిధిలో కాట్రేవులపల్లి నుంచి కానుకుర్తి వరకు చేపట్టిన భూసేకరణ అధికారులకు తలకు మించిన భారంగా మారింది. ఆయా మండలాల భూ నిర్వాసిత రైతులు ఎకరాకు రూ.14 లక్షల పరిహారం సరిపోదంటూ భూ సేకరణను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రాస్తారోకోలు, ధర్నాలు, కలెక్టరేట్‌ ముట్టడి వంటి కార్యక్రమాలతో సుమారు 45 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. నారాయణపేటలో రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నా రు. తాము ప్రాజెక్ట్‌కు వ్యతిరేకం కాదని.. బహి రంగ మార్కెట్‌ విలువననుసరించి 2013 చట్ట ప్రకారం పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇవ్వాల ని డిమాండ్‌ చేస్తున్నారు. అంతవరకూ ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరిస్తున్నారు.

14 ఎకరాలు కోల్పోతున్నాం..

మా తాతల నాటి నుంచి ఈ భూమినే నమ్ముకొని బతుకుతున్నాం. సర్వే నంబర్‌ 355లో మాకు 14 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మార్కెట్‌ విలువ ప్రకారం ఎకరాలకు రూ.35 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం. ప్రభుత్వం స్పష్టమైన హామీతో పరిహారం ఇస్తేగానీ భూములను వదులుకోలేం.

– శ్రీనివాస్‌రెడ్డి, భూ నిర్వాసిత రైతు. కాన్‌కుర్తి

భూమి పోతే బతుకు కష్టమౌతుంది

ఉన్న ఎకరన్నర భూమిని కోల్పోతే.. బతకడం కష్టమవుతుంది. ప్రభుత్వం మార్కెట్‌ ధర ప్రకారం పరిహారం ఇస్తే చాలనుకున్నాం. బలవంతంగా భూ సేకరణ చేస్తే ప్రాణాలైనా వదులకుంటాం.. కానీ భూమి వదలం.

– భీమప్ప, భూ నిర్వాసిత రైతు, కాన్‌కుర్తి

సీఎం ఇలాకాలో భూసేక‘రణం’! 1
1/2

సీఎం ఇలాకాలో భూసేక‘రణం’!

సీఎం ఇలాకాలో భూసేక‘రణం’! 2
2/2

సీఎం ఇలాకాలో భూసేక‘రణం’!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement