
బీజేపీ నిర్లక్ష్యం వల్లే యూరియా కొరత
రాజోళి: బీజేపి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే రైతులకు యూరియా కొరత ఏర్పడుతుందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. మండలంలోని పెద్దధన్వాడలో శుక్రవారం పలు అభివృద్ధి పనుల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవకపోయినప్పటికీ.. అభివృద్ధిలో మాత్రం ఓడిపోనివ్వమని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో నియోజకవర్గ సమస్యలు తెలియచేశానని, దానికి స్పందించిన ఆయన పలు పనులు మంజూరు చేశారన్నారు. గెలిచినా.. ఓడినా నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని, రైతుల ఽశ్రేయస్సు కోసమే పాటు పడతానని అన్నారు. యూరియా కొరతను కూడా రైతులు తన దృష్టికి తీసుకువచ్చారని, వరి పంటల కారణంగా యూరియా మరింత మోతాదులో అవసరమవుతుందని దాని విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడి, రైతులకు యూరియా కొరత లేకుండా చూస్తానన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రేవంత్ సర్కారు ముందుకు వచ్చి వారికి గూడును ఏర్పాటు చేస్తుందని అన్నారు. పెద్ద ధన్వాడ గ్రామానికి రోడ్డు లేక ఏళ్లు గడుస్తుందని, గత ప్రభుత్వం దానిపై పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, దాని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తు తం వర్షాల కారణంగా రోడ్డు మరింత దెబ్బతినడంతో తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కు చె క్కులు అందచేశారు. కార్యక్రమంలో దస్తగిరి,కుమార్,ఎల్లప్ప,అలెగ్జాండర్ తదిదరులు పాల్గొన్నారు.
పోలీసుల పహారా
మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు వస్తున్నాడని తెలిసిన క్రమంలో గ్రామానికి చెందిన యువకులు, ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక కమిటీల పేరుతో సంపత్‌కుమార్ పర్యటనను అడ్డుకోవాలని సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెట్టడంతో పోలీసులు ముందస్తుగా పహారా నిర్వహించారు. ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తల్తెకుండా ముందస్తుగా చర్యలు చేపట్టినట్లు గ్రామస్తులకు తెలియచేస్తూ గస్తీ నిర్వహించారు. కొందరు బీఆర్‌ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేసినట్లుగా సమాచారం.