
నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
గద్వాల క్రైం: వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, అల్లర్లకు, ఘర్షణలకు తావివ్వకుండా నిఘా ఉంచాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. శుక్రవారం వివిధ మండపాల నిర్వాహకులు నిమజ్జన కార్యక్రమాలు చేపట్టగా.. ఎస్పీ నదిగ్రహారం సమీపంలోని కృష్ణానది తీర ప్రాంతంలోని నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు. నిమజ్జనం సమయంలో భక్తుల కోలాహలం, నిర్వాహకుల కార్యక్రమాలపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. మండపాల నుంచి పురవీధుల గుండా ఉరేగింపుగా తరలించే తరుణంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. అల్లర్లకు, ఘర్షణలకు తావివ్వకుండా నిఘా ఉంచాలన్నారు. నిమజ్జనం సమయంలో ఎవరు కూడా నది వెలుపలికి వెళ్లకుండా కట్టడి చేయాలన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు ప్రవాహం కారణంగా ఎలాంటి అపశృతి జరగకుండా గజ ఈతగాళ్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్పీ వెంట సీఐ శ్రీను, కళ్యాణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.