
మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి
● స్వయం సహాయక సంఘాల సభ్యులు మార్కెటింగ్ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
● కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్: స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థికాభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం స్థానిక అనంత కన్వెన్షన్ హాల్‌లో నీతి ఆయోగ్–ఆస్పిరేషనల్ బ్లాక్స్ పోగ్రాంలో భాగంగా స్వయం సహాయక సంఘాల ఆద్వర్యంలో ‘ఆకాంక్ష హట్–ఎగ్జిబిషన్ అండ్ సేల్‌శ్రీలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మధ్యాహ్నం ఆయన సందర్శించారు. మెప్మా, డీఆర్‌డీఏ ఆద్వర్యంలో స్వయం సహయక సంఘాల మహిళలు తయారు చేసిన హ్యండ్లూమ్ వస్త్రాలు, గద్వాల చీరలు, సేంద్రీయ ఉత్పత్తులు, మిల్లెట్స్, పర్యావరణ రహిత వస్తువులు, వివిధ రకాల క్రాఫ్ట్స్, పలు రకాల స్వీట్స్, ఆభరణాలు తదితర స్టాల్స్‌ను కలెక్టర్ సందర్శించారు. మాట్లాడుతూ ఎంతో నైపుణ్యంతో స్వయం సహాయక సంఘాల మహిళలు పలు రకాల వస్తువులు, డోర్ మ్యాట్స్, చీరలు, స్వీట్స్ తయారు చేస్తున్నారని చెప్పారు. వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునే మహిళలకు మార్కెటింగ్ నైపుణ్యాలు పెంపొందే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ప్రభుత్వం అన్ని విధాలా సహకారం : ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకొని, ఆర్థికంగా అభివృద్ది చెందేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ‘ఆకాంక్ష హట్–ఎగ్జిబిషన్ అండ్ సేల్‌శ్రీలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను అడిషనల్ కలెక్టర్ నర్సింగరావ్‌తో కలిసి ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మహిళల వ్యాపారాల అభివృద్ధి కోసం ఎక్కడ స్టాల్‌లు ఏర్పాటు చేయాలనుకున్నా వారికి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. వారి అభివృద్ధి కోసం మెప్మా, డీఆర్‌డీఏల ద్వార రుణాలు అందించి, పోత్స్రహిస్తామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ జానకి రామ్, జిల్లా పశుసంవర్ధకశాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, జీఎం ఇండస్ట్రీస్ రామలింగేశ్వర్‌గౌడ్ పాల్గొన్నారు.