
నయా దందా..!
ఫోర్జరీలకు పాల్పడితే చర్యలు
ఫేక్ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాలతో రుణాలు
ప్రైవేట్ బ్యాంకు సిబ్బందిదే కీలక పాత్ర
అధికారులపై అనుమానాలు
–8లో u
రాజోళి: డబ్బు వెనకేసుకోవడమే లక్ష్యంగా జిల్లాలో కొందరు ప్రైవేట్ బ్యాంకు సిబ్బంది కొత్త దందాకు తెరలేపారు. మీ పేర్లపై ఆస్తులు లేకపోయినా.. తాతలు, అమ్మనాన్నల పేర్లపై ఉంటే చాలు.. మిగతాదంతా మేమే చూసుకుంటామంటూ నమ్మబలుకుతారు. మా బ్యాంకు ద్వారా రుణం అందిస్తాం.. నువ్వు చేయాల్సిందంతా రుణం మంజూరు కాగానే పర్సంటేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రూ.వేల నుంచి రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. ఇదే అదునుగా స్థానికంగా ఉన్న పైరవీకారులు వారితో కుమ్మకై ్క అమాయకులైన పల్లె ప్రజలను రుణాల పేరుతో మోసం చేస్తున్నారు.
నకిలీ పత్రాలు సృష్టించి..
రుణం పొందేందుకు సరైన పత్రాలు లేకున్నా.. దానిపై మీకు ఎలాంటి హక్కులు ఉన్నాయి, మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక కాగితం చూపించండని బ్యాంకు సిబ్బంది వారిని ప్రేరేపిస్తున్నారు. ఉన్న ఒక్క దాన్ని ఆసరాగా చేసుకుని, ఆస్తికి సంబంధించిన అన్ని నకిలీ పత్రాలను వారే తయారు చేస్తున్నారు. ఇవేవి తెలుసుకోకుండా.. అక్రమార్కులకు రూ.లక్షలు కమీషన్ల రూపంలో ఇచ్చి.. అనంతరం రుణ బకాయిలు చెల్లించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. అలాంటి వారిలో అలంపూర్ మండలం క్యాతూరు గ్రామానికి చెందిన ఒకరు, రాజోళి మండలం మాన్‌దొడ్డి గ్రామానికి చెందిన మరొకరు ఉన్నారు. మాన్‌దొడ్డి గ్రామానికి చెందిన ఒక ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి కారణంగా అదే గ్రామంతో పాటు, సమీపంలో ఉన్న పచ్చర్ల గ్రామంలోను అగ్గి రాజేసుకుంది. పచ్చర్లలో నేటికి అన్నదమ్ములు, తండ్రి కొడుకుల మధ్య తగాదాలు జరిగి, పంటను నాశనం చేసుకుని, కేసులు పెట్టుకునే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం అదే కుటుంబం రెండు వర్గాలుగా ఏర్పడి స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. సదరు వ్యక్తి కారణంగానే మాన్‌దొడ్డిలో రుణం తీసుకుని కమీషన్ ఎక్కువ కావాలని డిమాండ్ చేయడంతో గ్రామ పెద్దలు పంచాయితీ చేసి మందలించినట్లు సమాచారం. కానీ ఆయన తీరు మార్చుకోలేక అయిజలోకి మకాం మార్చి, తన కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇదే వ్యక్తి గట్టు మండలంలో 3, రాజోళి మండలంలో 2, అయిజలో 5, వడ్డేపల్లిలో ఒకటి ఇలా రుణాలు ఇప్పించినట్లు తెలుస్తుంది. ఇవికాక మరికొందరి దగ్గర రుణాల కోసం వేల రూపాయల్లో ముందుగానే డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తుంది.
నకిలీ సర్టిఫికెట్లు తయారుచేయడం, సంతకాలు ఫోర్జరీ చేయడం నేరం. రుణాల కోసం ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రజలు ఎవరూ కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించొద్దు.
– మొగిలయ్య, డీఎస్పీ
ప్రైవేట్ బ్యాంకు సిబ్బంది నిర్వాకం
రూ.వేల నుంచి రూ.లక్షల్లో
దండుకుంటున్న కమీషన్లు
అయిజ, గద్వాల, మాన్‌దొడ్డి
కేంద్రాలుగా లావాదేవీలు
జిల్లాలో ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు కూడా తమ సిబ్బందికి రుణాలు మంజూరు, రీకవరీ పేరిట లక్ష్యాలను నిర్దేశించింది. దీంతో తాము లక్ష్యాలను చేరుకోకుంటే జీతం రాదని తలచిన కొందరు ప్రైవేట్ బ్యాంకు సిబ్బంది.. గ్రామాల్లో డబ్బు అవసరమున్న అమాయకులను లక్ష్యం చేస్తున్నారు. వారికి ఉన్న ఆస్తుల వివరాలను తెలసుకుని, అందులో ఉన్న లోటు పాట్లను తెలసుకుని వారే ముందు ఉండి అమాయకులను లోన్ ట్రాప్‌లో దింపుతున్నారు.
జిల్లాలో ఇంత జరుగుతున్నా.. దానికి కారణమైన ప్రైవేట్ బ్యాంక్ సిబ్బంది వివరాలు తెలిసినా అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదనేది చర్చనీయాంశంగా మారింది. వీరు చేసే దందాలో అధికారులకు ఏమైనా పాత్ర ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. గట్టు, రాజోళి మండలాలకు సంబంధించిన ఫోర్జరీ సంతకాలు, ఫేక్ సర్టిఫికెట్లు బయటపడినా సంబంధిత అధికారులు వాటిపై ఎందుకు మౌనంగా ఉన్నారు. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి దందాలను మొదట్లోనే అడ్డుకోకుంటే.. గతంలో జరిగిన నకిలీ పాసు బుక్కుల కుంభకోణం తరహాలో రూ.కోట్ల రూపాయల్లో ఆస్తులకు ఎసరు పెడతారని, జిల్లా అధికారులు వారిపై కఠినమైన చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.