
ముకుందా.. ముకుందా
గద్వాల న్యూటౌన్/మల్దకల్: జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. హరేకృష్ణా నామస్మరణలతో జిల్లా కేంద్రం గాంధీచౌక్ సమీపంలోని కృష్ణమందిరం, చెన్నకేశవస్వామి ఆలయం, వేదనగర్‌లోని పాండురంగస్వామి ఆలయం, రాఘవేంద్రకాలనీలోని సత్యనారాయణ స్వామి ఆలయం, మండల పరిధిలోని రేపల్లె, వీరాపురంలలోని శ్రీకృష్ణ స్వామి ఆలయాలు మార్మోగాయి. ఆలయాలు కొత్తశోభను సంతరించుకున్నాయి. భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పలుచోట్ల నామకరణ, ఉట్టి కొట్టే కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులను చిన్ని కృష్ణుడు, గోపిక వేషధారణలతో అలంకరించారు.
సద్దలోనిపల్లిలో..
మల్దకల్ మండలంలోని సద్దలోనిపల్లిలో కృష్ణాష్టమి వేడుకలను శనివారం భక్తులు కనులపండువగా జరుపుకొన్నారు. పెద్దసంఖ్యలో భక్తులు ఆలయానికి కొత్తకుండల్లో దాసంగాలు సిద్ధం చేసి మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ అధికారులు భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. స్వామి వారి పల్లకీసేవ దశమికట్ట వరకు భాజాభజంత్రీలతో వెళ్లగా గ్రామస్తులు స్వామి వారికి పూజలు నిర్వహించారు. రాత్రి స్వామి వారి జననం, అనంతరం ఉత్సవమూర్తులతో పల్లకీసేవ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.
కృష్ణస్వామి మూలవిరాట్
జిల్లాలో కనులపండువగా
కృష్ణాష్టమి వేడుకలు
సద్దలోనిపల్లిలో అంబరాన్నంటిన వైనం

ముకుందా.. ముకుందా

ముకుందా.. ముకుందా