
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గద్వాల: మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రతలేదని, దాంతో పాటు కనీసం ప్రమాద బీమా కూడ లేదని సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జె.రాజమల్లు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని స్థానిక బృందావన్‌గార్డెన్ ఫంక్షన్ హాలులో జరిగిన మూడో జిల్లా మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ప్రమాద బీమా కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జీవితాంతం ప్రజలకు సేవలు అందించే కార్మికులకు ఉద్యోగ భద్రత లేకపోగా కనీసం ప్రమాద బీమాను కూడా కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. రాజీలేని పోరాటాల ద్వారానే ప్రభుత్వాల మెడలు వంచి హక్కులు సాధించుకోగలమన్నారు. ఈఎస్‌ఐ సౌకర్యం లేకపోవడంతో వైద్యం కోసం సొంత డబ్బులనే వెచ్చిస్తున్నారన్నారు. దీనికోసం అప్పులు సైతం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వెంకటస్వామి, వివి నర్సింహా, ఉప్పేర్ నర్సింహా, శివ, రవి, మహేష్, దేవి, లలితమ్మ, సత్యమ్మ, నరేష్, ప్రభుదాసు, సంజీవరాజు తదితరులు పాల్గొన్నారు.