
ఆదివాసుల హక్కుల కోసం ఉద్యమిద్దాం
గద్వాల: ఆదివాసుల హక్కుల కోసం ఉద్యమించి కగార్ హత్యాకాండ–కాల్పుల విరమణపై నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక నాయకులు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఆదివాసుల హక్కుల పోరాట సంఘీభావ వేదిక నాయకులు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మధ్య భారతంలో ఏడు నెలలుగా మావోయిస్టుల ఏరివేతలో భాగంగా అమాయకులైన ఆదివాసులను ఎన్‌కౌంటర్ల పేరిట హత్యలు చేసి వారిని మావోయిస్టుల ముద్రవేయడం వల్ల వారికి జీవించే హక్కుకు భంగం కలుగుతుందన్నారు. గడ్చిరోలి ప్రాంతంలోరూ.7లక్షల కోట్ల విలువ చేసే ఖనిజ సంపద ఉందని దానిని కార్పోరేట్లకు దోచిపెట్టేందుకే కేంద్రం ఆపరేషన్ కగార్ పేరిట దమణకాండను సృష్టిస్తుందని ఆరోపించారు. దేశంలో మొత్తం 461 ఆదివాసి తెగలు ఉండగా, అందులో 92 తెగలు అడవిపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని, వారి జీవన హక్కులను కేంద్రం ధ్వంసం చేస్తుందన్నారు. తక్షణమే కేంద్రం ఆపరేషన్ కగార్ నిలిపివేసి శాంతిచర్చలు జరిపి అడవులను ఆదివాసుల జీవించే హక్కులను కాపాడుతూ పర్యావరణాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌తో ఈనెల 24వ తేదీన వరంగల్‌లోని అంబేడ్కర్ భవన్‌లో సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో గోపాల్, జ్యోతి, వెంకటమ్మ, శంకరప్రభాకర్, నాగరాజు, సుభాన్, ప్రకాష్‌గౌడ్, ఆంజనేయులు, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.