
వైద్య సేవలపై ఆరా..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రాష్ట్ర బృందం విస్తృత తనిఖీ
●
గద్వాల క్రైం: ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఉంచింది. రోగులతో వైద్య సిబ్భంది అనుసరిస్తున్న విధానం, వారికి అందిస్తున్న చికిత్స, మందులు పూర్తి వివరాలను తెలుసుకునే పనిలో పడింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా.. మెరుగైన వైద్యం అందిస్తున్నారా.. ఏమేం మార్పులు చేస్తే బాగుంటుంది మొత్తంగా వైద్యశాఖలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అలాగే, ప్రైవేట్ ఆస్పత్రులు అనుమతులు పొందారా.. అర్హులైన వైద్యులు, టెక్నీషియన్లు ఉన్నారా.. ఫీజులు ఎంత వసూలు చేస్తున్నారు పూర్తి వివరాలతో నివేదికలు కోరారు. తాజాగా ఈ నెల 2వ తేదీన రాష్ట్ర మానిటరింగ్ అధికారి ఐఏఎస్ ఫణీందర్‌రెడ్డి బృందం జిల్లా ఆసుపత్రి, పీహెచ్‌సీలు, ప్రైవేటు ఆస్పత్రులను సందర్శించింది. రోగులకు అందుతున్న సేవలు, రికార్డులు, మందుల వివరాలు, అనుమతులపై వాకబు చేశారు.
పీహెచ్‌సీలో సేవలపై..
జిల్లా ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు రోగులకు అందించిన సేవలు, వివరాలపై బృందం సభ్యులు నివేదికలు కోరారు. గర్భిణులకు అందుతున్న సేవలు, సాధారణ డెలివరీలు, శస్త్ర చికిత్సలు, మెరుగైన చికిత్సల కోసం వైద్యులు సిఫార్సు వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న వైద్యుల జాబితా, విధులకు హాజరు మేరకు రిజిస్టర్లు, మందుల సరఫరా అంశాలపై వాకబు చేశారు. ప్రభుత్వం అభివృద్ధి పనుల నిమిత్తం మంజూరు చేసిన నిధులు, వినియోగించిన వివరాలు, టెండర్ ప్రక్రియ, కాంట్రాక్టర్ల వివరాలు, ఇప్పటి వరకు మౌలిక సౌకర్యాల కోసం వినియోగించిన నిధులు, మందుల సరఫరా అంశాలపై ఆరా తీశారు. ఇటీవల రూ.3 కోట్లతో జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుపై నివేదికలు కోరారు. మరోవైపు మెడికల్ కళాశాల బోధన విషయాలు, ప్రొఫెసర్లు, అవసరమయ్యే సిబ్బంది వివరాలపై బృందం సభ్యులు వాకబు చేశారు. ల్యాబ్‌లో ఉండాల్సిన పరికారాలు, రోగుల కోసం ఆధునిక పరికరాలు, వాటి పనితీరు, టెక్నిషన్‌లు, డయాలిస్ రోగులకు అందుతున్న సేవలు, సమస్యలను తెలుసుకున్నారు. అత్యవసర సేవల విషయంలో మెడికల్ కళాశాల ప్రొఫెసర్ల సహాయంతో మెరుగైన వైద్య సేవలు అందించల్సిందిగా రాష్ట్ర మానిటరింగ్ అధికారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
నివేదికలు కోరారు..
రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఈఏమరకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న సేవలపై రాష్ట్ర మానిటరింగ్ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఎక్కువగా ఏ జబ్బుతో బాధపడుతున్నారు, వారికి అందిస్తున్న వైద్య సేవలు, వైద్యులు సూచించిన మందుల వినియోగం తదితర విషయాలపై నివేదికలు కోరారు. జిల్లా ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉందని తెలియజేశాం. అవసరమయ్యే మౌలిక వసతులు, సౌకర్యాలపై వివరించాం. 300 పడకల ఆసుపత్రిని 550 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాల్సిందిగా కోరాం. – సిద్దప్ప, జిల్లా ఇన్‌చార్జ్ వైద్యాధికారి
ప్రైవేట్ ఆస్పత్రుల్లో సౌకర్యాలు, ఫీజులపై వాకబు
మెరుగైన వైద్యసేవలు అందడమే
లక్ష్యం..

వైద్య సేవలపై ఆరా..

వైద్య సేవలపై ఆరా..