మున్సిపాలిటీలో ఉద్యోగుల వాగ్వాదం
గద్వాలటౌన్: పురు ప్రజలకు మెరుగైన సేవలందించి, మార్గదర్శకంగా ఉండాల్సిన ఇద్దరు ఉద్యోగులు సహనం కోల్పోయారు. బిల్లుల చెల్లింపులో తలెత్తిన అంశం వారి వాగ్వాదానికి కారణమైంది. దీంతో కోపోద్రిక్తులైన ఇరువురు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ వాగ్వాదానికి దిగిన సంఘటన గద్వాల మున్సిపల్ కార్యాలయంలో బుధవారం చోటుచేసుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా.. పట్టణంలో పారిశుద్ధ్య పనులు చేసేందుకు ఓ కార్మికుడిని శానిటేషన్ విభాగంలో అనధికారికంగా నియమించుకున్నారు. ఆయనకు ఒక నెల వేతనం సైతం చెల్లించారు. దీనిపై ఇటీవల పలువురు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, తక్షణమే అనధికారికంగా పొందుతున్న కార్మికుడి వేతనం నిలిపివేయాలని సంబంధిత సెక్షన్ అధికారులకి కమిషనర్ ఆదేశించారు. ఆ కార్మికుడి వేతనం కోసం శానిటరీ ఇన్‌స్పెక్టర్ మన్సూర్ పలుసార్లు సీనియర్ అసిస్టెంట్ అశోక్‌కుమార్‌కు విన్నవించుకున్నారు. బుధవారం శానిటరీ ఇన్‌స్పెక్టర్ మన్సూర్.. సీనియర్ అసిస్టెంట్ అశోక్‌కుమార్ చాంబర్‌కు వెళ్లి కార్మికుడి వేతనం కోసం పట్టుపట్టి నిలదీశారు. సహనం కోల్పోయి దుర్బాషలాడారు. అశోక్‌కుమార్ సైతం అదేస్థాయిలో మన్సూర్‌తో వాదనకు దిగారు. ఇరువురు ఉద్యోగుల మధ్య మాటా మాటా పెరిగి వాదన తీవ్రస్థాయికి చేరుకుంది. ఒకరి మీదకు మరొకరు వెళ్లి తోసుకునే పరిస్థితి నెలకొంది. ‘బయటకు రా నీ కథ చూస్తా అంటూ..’ శానిటరీ ఇన్‌స్పెక్టర్ మన్సూర్ హెచ్చరించాడు. నీ బెదిరింపులకు ఎవరూ భయపడరని సీనియర్ అసిస్టెంట్ అశోక్‌కుమార్ తెగేసి చెప్పాడు. తీవ్రస్వరంతో ఇరువురు ఉద్యోగులు వాగ్వివాదానికి దిగడంతో కార్యాలయంలోని ఉద్యోగులు, సిబ్బంది మొత్తం గుమిగూడారు. తోటి ఉద్యోగులు కలగజేసుకుని వాగ్వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. కొద్దిసేపటికే ఈ విషయం పట్టణంలో దావణంలా వ్యాపించింది. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన గొడవ వ్యవహరాన్ని ఇరువురు ఉద్యోగులు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఇరువురు ఉద్యోగుల వివరణ కోరగా.. బిల్లుల చెల్లింపు విషయంలో కొంత వాదన జరిగింది. అంతే తప్ప ఏ గొడవ లేదని చెప్పారు. ఉద్యోగుల గోడవపై విచారించి చర్యలు తీసుకుంటామని అడిషినల్ కలెక్టర్ నర్సింగరావు తెలిపారు.


