పూడిక తొలగేనా..?
జిల్లా కేంద్రంలో పూడుకపోయిన డ్రెయినేజీలు
లోతట్టు ప్రాంతాలకు ముప్పు
వేసవి ముగుస్తుంది. మరికొన్ని రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయి. మూడు నాలుగు రోజుల నుంచే ముసురు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పట్టణంలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు మాత్రం వర్షాకాలం వస్తోందంటేనే భయం మొదలవుతుంది. అవన్నీ లోతట్టు ప్రాంతాలు కావడంతో వానొస్తే నీరు నిలిచిపోతుంది. మురికి నీరు డ్రయిన్లలోంచి పొంగి ప్రవహిస్తోంది. ప్రధానంగా జిల్లా కేంద్రంలోని కుంట వీధి, నల్లకుంట, జివిలివీధి, పాత హౌసింగ్‌బోర్డు కాలనీలోని కొంతభాగం, సుంకులమ్మమెట్టు, ఒంటెలపేట తదితర కాలనీలు జలమయమవుతూ ఉంటాయి. పట్టణంలోని తుల్జారాం గుడి, కూరగాయల మార్కెట్, రథశాల ప్రధాన పరిసర ప్రాంతాలు అధ్వాన్నంగా మారతాయి. అయినా ముందస్తు జాగ్రతలు చేపట్టడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. పైన పేర్కొన్న కాలనీలలో డ్రైనేజీ వ్యవస్త అస్తవ్యస్థంగా ఉంది. ఇప్పటికై నా అధికారులు ముందస్తుతో సమగ్రమైన ప్రణాళిక రూపొందించుకొని డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.
గద్వాలటౌన్: మరికొన్ని రోజుల్లో వానాకాలం ప్రారంభం కానుంది. అప్పుడే వర్షాలు సైతం కురుస్తున్నాయి. అయినా కూడా జిల్లా కేంద్రంలోని అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారనే ఆరోపణలు ప్రజల నుంచి వినవస్తున్నాయి. గద్వాల మున్సిపాలిటీల్లో చాలామటుకు డ్రెయినేజీలు చెత్తా చెదారంతో, శివారు ప్రాంతాల్లోని ప్రధాన మురికి కాల్వలు అన్నీ పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. భారీ వర్షాలు కురిస్తే అవన్ని పొంగి పొర్లుతాయని, పట్టణం దుర్గంధంగా మారుతుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని అధికారులకు తెలిసినా.. తగు చర్యలు మాత్రం చేపట్టరు. ప్రజలను వర్షాకాలం కష్టాల నుంచి తప్పించేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన అవసరం వారిపై ఎంతైనా ఉంది.
జనాభా 80,000
మురుగు కాల్వల ఆక్రమణ.. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలకు పొంచి ఉన్న ముప్పు
ముందుజాగ్రత్త చర్యలు చేపట్టడంలో అధికారుల తాత్సారం
త్వరలో చేపడతాం
వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీలలో పేరుకుపోయిన చెత్తా, చెదారం పూడికతీత పనులను చేపడతాం. ఇందుకోసం అవసరమైన డ్రెయినేజీలు గుర్తించడంతో పాటు వాటికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం. అవసరమైన చోట యంత్రాలను ఉపయోగించి పూడికతీత చేస్తాం. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం.
– దశరథ్, ఇన్‌చార్జ్ కమిషనర్, గద్వాల
పూడిక తొలగేనా..?
పూడిక తొలగేనా..?


