
‘రియల్’ మోసాలు..
●
● నడిగడ్డలో స్కీంల పేరిట యథేచ్ఛగా దందా
● కాలపరిమితి ముగిసినాస్థలాలు రిజిస్ట్రేషన్ చేయని వైనం
● రీ క్రియేషనల్ స్థలంలోనూవెంచర్లు ఏర్పాటు
● లబోదిబోమంటున్న బాధితులు
● నాలుగు నెలల్లో 93 ఫిర్యాదులు
క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం
జిల్లాలో పలు రియల్ ఏస్టేట్ వ్యాపారులపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు వస్తున్నాయి. మోసం చేసిన వ్యక్తులపై వివిధ పోలీసు స్టేషన్‌లో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఎవరైన వెంచర్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో ప్రభుత్వ అనుమతి పొంది ఉండాలి. వెంచర్ అనుమతుల విషయంలో రెవెన్యూ, నగరపాలక, గ్రామీణ స్థాయిలో పంచాయతీ అధికారులు ధృవీకరించాలి. మొత్తం డబ్బు చెల్లించినా ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయకున్నా.. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి వెంచర్లు వేసినా వారిపై చీటింగ్ కేసులు నమోదు చేస్తాం.
– శ్రీనివాసరావు, ఎస్పీ
గద్వాల క్రైం: సొంతిళ్లు నిర్మించుకోవాలనేది ప్రతిఒక్కరి కల. దీనిని అవకాశంగా మార్చుకున్న కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమాయక ప్రజలే లక్ష్యంగా కొత్త కొత్త స్కీంల పేరిట దందా నిర్వహిస్తూ ప్రజలను నట్టేట ముంచుతున్నారు. ప్రధానంగా పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకు స్థలాలు ఇస్తామంటూ స్కీంల పేరిట వాయిదాల రూపంలో డబ్బులు వసూలు చేసి ఏళ్లు గడుస్తున్నా స్థలాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. వారి కబంధ హస్తాల్లో చిక్కుకుని న్యాయం కోసం బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని పార్కులు, విశ్రాంతి స్థలాల ఏర్పాటుకు కేటాయించిన రీ క్రియేషన్ స్థలాలు సైతం కబ్జా చేసి వీటిని కూడా వెంచర్లుగా చేసి ప్రభుత్వ ఆస్తులను సొంతం చేసుకునే కుట్రలకు పాల్పడుతున్నారు.
జిల్లాలో ఇటీవల వచ్చిన ఫిర్యాదులు..
● 3.02.2025 తేదీన గద్వాల పట్టణానికి చెందిన ఓ రిటైర్డు ప్రొఫెసర్ 2000 సంవత్సరం నుంచి 2003 వరకు ఓం సాయి ప్రియ రియల్ ఏస్టేట్‌లో స్కీం పేరిట నెల వారిగా డబ్బులు చెల్లించాడు. వెంచర్‌లో సభ్యుడుగా కాలపరిమితి స్కీం డబ్బులు చెల్లించాడు. అయితే సదరు రియల్ ఏస్టేట్ వ్యాపారులు మాత్రం ఆ ఉద్యోగికి స్థలం రిజిస్ట్రేషన్ చేయలేదు. దీనిపై పలుమార్లు పంచాయితీలు చోటు చేసుకున్నాయి. నేడు రేపు అంటూ సాగదీశారు. మోసపోయినట్లు గుర్తించి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించాడు.
● 14.02.2025 తేదీన గట్టు మండలానికి చెందిన ఓకే కుటుంబానికి చెందిన ఏడుగురు తాము పూర్తిగా స్కీం డబ్బులు చెల్లించినా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ పోలీసులను ఆశ్రయించారు. వీరికి రియల్ ఏస్టేట్ వ్యాపారి స్వయాన బంధువు కావడంతో ముబారక్ నైన్ రియల్ ఏస్టేట్‌లో 2013 నుంచి 2018 వరకు స్కీంలో ప్లాట్ కోసం డబ్బులు చెల్లించారు. కాలపరిమితి ముగియగా వారికి ఇవ్వాల్సిన ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేయించాల్సిందిగా రియల్ ఎస్టేట్ సభ్యులను కోరారు. త్వరలో రిజిస్ట్రేషన్ చేయిస్తామని నమ్మించారు. నేటికీ ఎలాంటి పురోగతి రాలేదు.
● 19.03.2025 తేదీన అయిజకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి న్యాయం చేయాలని పోలీసులను సంప్రదించారు. ఈయన అగ్రిగోల్డ్ రియల్ ఏస్టేట్‌లో 2012లో స్కీంలో ప్లాట్ కోసం డబ్బులు చెల్లించాడు. అయితే కాలపరిమితి ముగిసిన క్రమంలో ఆ సంస్థ నిర్వాహకులు బోర్డు తీప్పేయడంతో అయోమయంలో పడ్డాడు.
● 23.01.2025 తేదీన ఇటిక్యాల మండలానికి చెందిన ప్రైవేటు వ్యాపారులు సలీం, కలీం పోలీసులను ఆశ్రయించారు. వీరు ప్లాట్ల స్కీంలో భాగంగా 2014లో డబ్బులు చెల్లించారు. అయితే కాలపరిమితి ముగిసినా సదరు వ్యాపారులు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించకుండా కార్యాలయం చుట్టూ తిప్పుతూ వచ్చారు. నేటికి స్థలం రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో చివరికి వారు పోలీసులను ఆశ్రయించారు. ఇలా గద్వాల – అలంపూర్ సెగ్మెంట్‌లలో గడచిన నాలుగు నెలల వ్యవధిలోనే 93 ఫిర్యాదులు పోలీసులకు వచ్చాయి. ఈ ఫిర్యాదులు సైతం జిల్లా పోలీసుశాఖ నిర్వహించిన ప్రజావాణిలో అందాయి. రెక్కలు ముక్కలు చేసుకొని వచ్చిన డబ్బును నెల నెలా చెల్లించామని, తీరా ఇన్నాళ్లకు స్థలం రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వమంటే నేడు రేపు అంటూ తిప్పుకుంటున్నారని, తమకు న్యాయం చేయాలని జిల్లా అధికారులను బాధితులు కోరుతున్నారు.
ప్రభుత్వ స్థలాలు కబ్జా..
గద్వాల జిల్లా కేంద్రంలో పార్కులు, విశ్రాంతి లేదా వినోదాల కోసం (రీ క్రియేషన్) కేటాయించిన భూములను సైతం రియల్ వ్యాపారులు కబ్జా చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వే నంబర్లలో 57, 103, 413, 414, 415, 416, 419, 421, 422, 423, 424, 425, 426, 427, 431, 460 –494 వరకు, 671, 691, 707, 710,723, 745, 749, 758, 803, 906, 1091, 1090, 1039, 1079, 1031, 1035, 995,994, 993, 991 తదితర సర్వే నంబర్లలో 100 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఇందుల్లో పార్కులు, క్రీడా మైదానాలు, క్యాంపసైట్‌లు, హైకింగ్, క్యాంపింగ్, ఈత కొలనులు తది తర వాటి కోసం భూములు కేటాయిస్తే వీటిని సైతం రియల్ ఏస్టేట్ వ్యాపారులు వెంచర్లుగా మార్చేశారు. ఈమేరకు పలువురు ఫిర్యాదులు సైతం చేశారు.

‘రియల్’ మోసాలు..

‘రియల్’ మోసాలు..