రైతు సంబరాలను అడ్డుకున్న పోలీసులు
గట్టు: మండలంలోని బల్గెరలో దిగంబరస్వామి జాతర సందర్భంగా మంగళవారం నిర్వహించాల్సిన రైతు సంబరాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గట్టు ఎస్‌ఐ మల్లేష్,మల్దకల్ ఎస్‌ఐ నందికర్, కేటిదొడ్డి ఎస్‌ఐ శ్రీనివాస్‌తోపాటు భారీగా పోలీసు బలగాలు బల్గెరకు చేరుకున్నాయి. రైతు సంబరాలను నిర్వహించే బీఆర్‌ఎస్ నేత బల్గెర హనుమంతును అతని ఇంటి దగ్గరే హౌస్ అరెస్టు చేశారు. రైతు సంబరాలను నిర్వహించడానికి వీలు లేదని, అలా కాదని ఎవరైనా ప్రయత్నిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. దీంతో విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు, రైతులు పెద్ద ఎత్తున హనుమంతునాయుడు ఇంటికి చేరుకున్నారు. కొంత సేపు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొన్నేళ్లుగా ప్రశాంతంగా నిర్వహిస్తున్న రైతు సంబరాలను ఇప్పుడు అడ్డుకోవడం ఏమిటని, రాజకీయ కక్షతోనే ఇదంతా చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసపూరితంగా అడ్డుకుంటున్నట్లు హనుమంతునాయుడు ఆరోపించారు. పోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఎద్దుల యజయానులను పంపించేశారు. రాత్రి వరకు పోలీసులు బల్గెరలో పికెట్ ఏర్పాటు చేశారు.


