వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ వ్యతిరేకం
గద్వాల టౌన్: కేంద్రం చేపట్టిన వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని, సంఘటిత ఉద్యమాలతోనే దీన్ని తిప్పికొట్టాలని ముస్లిం మతపెద్దలు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల బాధ్యులు అన్నారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఈద్గా చౌరస్తా నుంచి ప్రధాన రహదారుల వెంట భారీ ర్యాలీ తీశారు. వీరికి ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి సరిత, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, బీఆర్‌ఎస్ నాయకుడు వెంకట్రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, ప్రజా సంఘాల నాయకుడు మోహన్ తదితరులు సంఘీభావం తెలిపి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం ముస్లింలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తుందని విమర్శించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేసే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులను కొల్లగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రపన్నిందని ఆరోపించారు. దేశంలో మరో విభజనకు బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ నర్సింగరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలు అబ్బాస్, ఉస్మాన్, ఫయీమ్, జబ్బార్, ఈద్గా కమిటీ అధ్యక్షుడు ఖలీల్, న్యాయవాది షఫీఉల్లా, అతికుర్ రహమాన్, దౌలత్, సీరాజుద్దీన్, మక్బూల్, ఎక్బాల్ తదితరులు పాల్గొన్నారు.


