
ఉన్నత విద్యతోనే ఉజ్వల భవిష్యత్
అయిజ/మల్దకల్: విద్యార్థులు శ్రద్ధగా ఉన్నత విద్య అభ్యసిస్తేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్‌జడ్జి గంట కవితాదేవి అన్నారు. మంగళవారం మండలంలోని పులికల్ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, మధ్యాహ్న భోజనం వంట సరుకులను న్యాయమూర్తి పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని.. ఎక్కడైనా బాల్యవివాహం చేసేందుకు సిద్ధమైతే పోలీసులకు సమాచారం అందించాలని విద్యార్థులకు సూచించారు. అంతకుముందు విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాలకు 5 కి.మీ. దూరంలోని బైనపల్లి, కిసాన్ నగర్, రాజాపురం గ్రామాల నుంచి వస్తున్నామని, తమకు సైకిళ్లు ఇప్పించాలని విద్యార్థులు కోరగా.. దాతలతో మాట్లాడి సైకిళ్ల పంపిణీకి కృషిచేస్తానని న్యాయమూర్తి హామీ ఇచ్చారు.
● మల్దకల్ ఆదిశిలా క్షేత్రంలో స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వర స్వామిని సీనియర్ సివిల్‌జడ్జి కవితాదేవి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, అర్చకులు న్యాయమూర్తి కుటుంబ సభ్యులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. న్యాయమూర్తిని శాలువాతో సత్కరించి మెమోంటో అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు రవిచారి, చంద్రశేఖర్‌రావు, మధుసూదనాచారి పాల్గొన్నారు.