గద్వాల వ్యవసాయం: ఈ ఏడాది కూడా చిరుధాన్యాల సాగు జిల్లాలో అంతంతమాత్రంగానే ఉంది. మార్కెట్‌లో చిరుధాన్యాలకు మంచి డిమాండ్ ఉంది. అయినా వీటి సాగుపై రైతులు ఆసక్తి కనబర్చడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు వీటి సాగుపై రైతులకు అవగాహన కల్పిండంలో విఫలమవుతున్నారు. మరో ముఖ్య ఆహార పంటలైన అయిన జొన్న, సజ్జ సాగు విస్తీర్ణం గతంతో పోల్చితే కాస్తంత పెరిగింది. ఇంకా పెరగాలిసన అవసరం ఉంది.
చిరుధాన్యాలతో రోగాలు దూరం
దైనందిన జీవితంలో చాలామంది అనేక రకాలుగా ఒత్తిళ్లకు లోనవుతుండటంతో పాటు, ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులతో పలు రకాల అనారోగ్య సమస్యలకు, ధీర్ఘకాలిక వ్యాధులకు గురవువుతున్నారు. బీపీ, షుగర్, ఆస్తమా, కీళ్లనొప్పులు తదితర వాటికి గురవడంతో పాటు, కిడ్నీ, లివర్, గుండె సంబంధిత సమస్యలతో శారీరకంగా బలహీన పడుతున్నారు. ఇలాంటి వారికి బలవర్దకమైన ఆహరం చిరుధాన్యాలే. ముఖ్యంగా కొర్రలు, అండుకొర్రల్లో పీచుపదార్థాలతో పాటు, బలమైన పోషక విలువలుంటాయి. రాగుల్లో క్యాల్షియం, ఐరన్ ఉంటాయి.వీటిని ఆహరంగా తీసుకుంటే బీపీ, షుగర్ లాంటి రోగాలు దూరం కావడంతో పాటు, శారీరకంగా బలపడతారు.
అవగాహన, మార్కెటింగ్ సౌకర్యం కరువు
గడిచిన ఏడెనిమిది ఏళ్ల నుంచి చిరుధాన్యాల ఆవశ్యకతపై వైద్యులు, మేధావులు ఆహారపు అలవాట్లుగా చేసుకోవాలని సలహాలు ఇస్తున్నారు. దీంతో వీటికి మార్కెట్‌లో డిమాండ్ ఏర్పడింది. అయినా వీటి సాగుపై రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పత్తి, వరి, వేరుశనగ తదితర పంటలపై మొగ్గు చూపుతున్నారు. చిరుధాన్యాలన్ని ఆరుతడి పంటలే. సాధారణంగా రెండు సీజన్లలో సాగు చేయవచ్చు. అయితే ఈ పంటల్లో కలుపు ఎక్కువగా వస్తుంది. దీనికితోడు నూతన యాజమాన్య పద్ధతులపై రైతులకు సరైన అవగాహన లేదు. స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యం లేదు. వీటన్నింటి ఫలితంగా జిల్లాలో పత్తి, పొగాకు లాంటి వాణిజ్య పంటలు, వరి లాంటి ఆహారపు పంటలపై ఎక్కువగా దృష్టి సారిస్తూ వస్తున్నారు. కారణం వరి, పత్తి తదితర పంటలకు మార్కెటింగ్ సౌకర్యంతో పాటు, మద్దతు ధరకు ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేస్తుండటమే.
కాస్త పెరిగిన జొన్న, సజ్జ
చిరుధాన్యాలకు బాగా డిమాండ్ ఉన్నందున స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంతోపాటు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. అయితే, జొన్న, సజ్జలు పోషక విలువలు ఉండే బలవర్ధకమైన ఆహారం. ఈపంటల సాగు ఈ ఏడాది కొంత పెరిగిన ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. వీటికి మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు ఉన్నాయి. పది, పదిహేనేళ్ల క్రితం వరకు జొన్న, సజ్జ సాగు చేసిన రైతులు ఆతర్వాత వరి, పత్తి లాంటి పంటలను వేస్తున్నారు. ఇక్కడి ప్రాంత ప్రజలు నాణ్యమైన జొన్నలు లభించకపోవడంతో కర్ణాటకలోని రాయచూర్ నుంచి తెచ్చుకుంటున్నారు. జొన్న, సజ్జల సాగు బాగా పెరిగేలా రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
జిల్లాలో పంటల సాగు ఇలా.. (ఎకరాల్లో)
ఏడాది చిరుధాన్యాలు జొన్న, సజ్జ
2016–17 500 6,881
17–18 650 4,138
18–19 1050 3,767
19–20 271 2,572
20–21 380 3,412
21–22 325 4,210
22–23 539 5,467
23–24 269 3,220
24–25 276 6,221
అవగాహన కల్పిస్తాం
చిరుధాన్యాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అయినప్పటికి ఇక్కడి రైతులు వాణిజ్య, ఇతర ఆహార పంటలపైనే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. కొర్ర, అండుకొర్రలు వేసేలా రైతులకు ఏటా చెబుతున్నాం. జొన్న, సజ్జ పంటకు పిట్టల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఒక కారణం. చిరుధాన్యాలు ఎక్కువగా సాగు చేసేలా రైతులకు అవాహన కల్పిస్తాం.
– సక్రియానాయక్, డీఏఓ
డిమాండ్ ఉన్నా వీటి సాగుపై
రైతుల అనాసక్తి
అవగాహన కల్పించడంలో
వ్యవసాయశాఖ విఫలం
జిల్లాలో కాస్త పెరిగిన జొన్న, సజ్జ సాగు
‘ఆత్మ’కు నిధుల కేటాయింపు ఏదీ..?
చిరుధాన్యాల సాగుపై వ్యవసాయ అధికారులు ఆత్మ (వ్యవసాయ సాంకేతిక సంస్థ) ఆధ్వర్యంలో 2019లో అవగాహన సదస్సులు నిర్వహించారు. రైతులు ఎక్కువగా చిరుధాన్యాలు సాగు చేసేలా చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు జాతీయ ఆహార భద్రత (ఎన్‌ఎఫ్‌ఎస్) పథకం కింద పండించే రైతులకు 90శాతం సబ్సీడీపై విత్తనాలు అందించి ప్రోత్సహించారు. దీనివల్ల 2016, 2017, 2018 గణాంకాలను పోల్చితే 2019లో సాగు పెరిగింది. ఆతర్వాత 2020 నుంచి మళ్లీ తగ్గింది. ఎప్పటి లాగే రైతులు వరి, పత్తిపై దృష్టి సారించారు. ఇదిలా ఉంటే ‘ఆత్మ’కు గడిచిన నాలుగేళ్లుగా నిధులు కేటాయించడం లేదు. దీంతో కార్యక్రమాలకు నిలిచిపోయాయి.
అరకొరగానే.. చిరుధాన్యాలు
అరకొరగానే.. చిరుధాన్యాలు


