అర్హులందరికీ సంక్షేమ పథకాలు
అలంపూర్: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఆదివారం అలంపూర్ చౌరస్తాలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలంపూర్, ఉండవెల్లి, మానవపాడు, ఇటిక్యాల, ఎర్రవల్లి, అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాలకు చెందిన 306 మంది లబ్ధిదారులకు రూ.36,35,496 విలువగల చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి కుటుంబాల్లో వివాహాలకు ఆర్థిక సాయం అందించడమే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లక్ష్యమన్నారు. సీఎం సహాయ నిధి ద్వార 161 మంది లబ్ధిదారులకు రూ. 40 లక్షల చెక్కులను అందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల రెవెన్యూ అధికారులు, నాయకులు, లబ్దిదారులు ఉన్నారు.
అక్రమ అరెస్టులతో
ఉద్యమాన్ని ఆపలేరు
అలంపూర్: ఆశా కార్యకర్తలు సమస్యల పరిష్కారం కోరుతూ చలో అసెంబ్లీకి పిలుపునివ్వగా.. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని.. అణచివేతతో ఉద్యమాలను ఆపలేదని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు రాజు అన్నారు. ఆదివారం అలంపూర్ పట్టణంలోని కేవీపీఎస్ కార్యాలయంలో సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 24వ తేదీన చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారని, సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం పోలీసులతో ముందస్తు అరెస్టులు చేయిస్తుందని ఆరోపించారు. ఒక రోజు ముందే పోలీసులు ఆశ కార్యకర్తల ఇళ్ల వద్దకు వెళ్లి వారిని కట్టడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే హక్కు కార్మికులకు ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా పోలీసలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.18 వేలు, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. సీఎం రెవంత్ రెడ్డి ముందస్తు అరెస్టులతో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆశా కార్యకర్తల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నరసింహ్మ, అయ్యప్ప, నాగరాజు ఉన్నారు.


