ఐదెకరాల భూమికి టెండర్‌ | - | Sakshi
Sakshi News home page

ఐదెకరాల భూమికి టెండర్‌

Mar 17 2025 11:18 AM | Updated on Mar 17 2025 11:11 AM

నకిలీ వారసుడి నిర్వాకం

గట్టు: మొన్నటికి మొన్న.. గట్టుకు చెందిన ఓ వ్యవసాయ భూమి యజమాని 2016లో చనిపోతే ఆ వ్యక్తి ఆధార్‌ను మరో వ్యక్తి లింకు చేసుకొని 2021లో గట్టు రెవెన్యూ ఆఫీసులో దర్జాగా భూ బదలాయింపు చేశారు. దాయాది కుటుంబ సభ్యులు రెవెన్యూ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగడంతో ఈ వ్యవహారం బయట పడింది. నిన్నేమో.. ఆలూరులో ఒక కులానికి చెందిన వ్యక్తి చనిపోతే మరో కులానికి చెందిన వ్యక్తి ఆ భూమికి తామే వారసులమని వారసత్వం భూమిని బదలాయించగా తమ పనితనాన్ని చాటుకొని ఔరా అనిపించుకున్నారు. ఇక తాజా విషయానికి వస్తే.. వారసులు కాని వారసులు గట్టు రెవెన్యూ అధికారుల సహకారంతో తప్పుడు ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ తీసుకొని ఇందువాసి శివారులోని 5–18 ఎకరాల భూమికి టెండర్‌ పెట్టారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. మొత్తంగా గట్టు రెవెన్యూ అధికారులు ఏం చేసినా అడిగే దిక్కెవరు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఉన్నతాధికారులు కూడా ఇవేం పెద్ద నేరాలు కాదన్నట్లుగా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో వీరి అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని సామాన్యులు ఆరోపిస్తున్నారు.

తప్పుడు ఫ్యామిలీ మెంబర్‌ సరిఫ్టికెట్‌తో..

ఇటీవల ఇందువాసి గ్రామ శివారులోని సర్వే నెంబర్‌ 385/బీ/1లోని 5–18 ఎకరాల భూమికి అసలు వారసులు కాకుండా నకిలీ వారసులు ముందుకు వచ్చి భూమిని కాజేసే ప్రయత్నం చేశారు. వారం రోజుల క్రితం అక్రమ భూ బదలాయింపు వ్యవహారంపై అసలు వారసులు గట్టు రెవెన్యూ కార్యాలయానికి చేరుకొని ఘర్షణకు దిగి, పోలీస్‌ స్టేషన్‌ దాకా పంచాయితీ వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. ఇందువాసి గ్రామానికి చెందిన ముత్తయ్య తండ్రి ఇంజన్నకు గ్రామ శివారులోని సర్వే నెంబర్‌ 358/బీ/1లో 5–18 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ముత్తయ్య ప్రకాష్‌, గొర్లన్న అనే ఇద్దరు కుమారులతో పాటుగా ముగ్గురు కుమార్తెలున్నారు. అయితే సదరు భూ యజమానితో పాటుగా కుటుంబ సభ్యులు ఉపాధి నిమిత్తం శాంతినగర్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. భూ యజమాని చనిపోయిన విషయం తెలుసుకున్న దాయాది అయిన విజయ్‌ తండ్రి ఇంజన్న అనే వ్యక్తి చనిపోయిన ముత్తయ్య తన తండ్రి కాకపోయినప్పటికి తన తండ్రే అని రెవెన్యూ అధికారులను నమ్మించాడు. ముత్తయ్య ఆధార్‌ లింకును తన తండ్రి ఇంజన్న ఆధార్‌కు లింకు చేయించుకున్నాడు. తన తండ్రి ఇంజన్న, తల్లి సుశీలమ్మ బతికుండగానే చనిపోయినట్లుగా నమ్మించి, గత ఏడాది నవంబర్‌లో తప్పుడు ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ను తీసుకున్నాడు. ఈ ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ ఆధారంగా గత ఏడాది నవంబర్‌లో గట్టు తహసీల్దార్‌ కార్యాలయంలో వారసత్వంగా భూ బదలాయింపునకు ప్రయత్నించాడు. విషయం కాస్త శాంతినగర్‌లో ఉండే అసలు వారసుడికి తెలియడంతో గట్టు రెవెన్యూ కార్యాలయానికి వచ్చి, భూ బదలాయింపును అడ్డుకొని వాగ్వానికి దిగారు. ఈ సంఘటన జరిగిన కొన్నాళ్ల తర్వాత తహసీల్దార్‌ మారిపోవడంతో నకిలీ వారసుడు మళ్లీ రెవెన్యూ అధికారుల దగ్గర భూ బదలాయింపునకు ప్రయత్నించగా, అసలు వారసులు రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని రెవెన్యూ అధికారుల ఎదుటే ఘర్షణకు దిగారు. రెవెన్యూ అధికారులు అసలు విషయం తెలుసుకుని భూ బదలాయింపును నిలిపి వేసినట్లు తెలిసింది.

కళ్లు మూసుకుని ఫ్యామిలీ మెంబర్‌ సరిఫ్టికెట్‌ ఇచ్చిన అధికారులు

అసలు వారసుడి రంగప్రవేశంతో ఆగిన భూ బదలాయింపు

ఇందువాసి శివారులోని భూమికి ఎసరు

తహసీల్దార్‌ ఏమంటున్నారంటే..

ఇందువాసి భూ బదలాయింపు వ్యవహారం తన దృష్టికి వచ్చినట్లు తహసీల్దార్‌ సలిముద్దీన్‌ తెలిపారు. తప్పుడు ప్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ తీసుకున్నట్లు తన దృష్టికి రావడంతో రిజిస్ట్రేషన్‌ను నిలిపి వేశాం. గతంలో జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేయాల్సిందిగా ఆర్డీఓకు సిఫారస్‌ చేసినట్లు తహసీల్దార్‌ తెలిపారు.

ఐదెకరాల భూమికి టెండర్‌ 1
1/3

ఐదెకరాల భూమికి టెండర్‌

ఐదెకరాల భూమికి టెండర్‌ 2
2/3

ఐదెకరాల భూమికి టెండర్‌

ఐదెకరాల భూమికి టెండర్‌ 3
3/3

ఐదెకరాల భూమికి టెండర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement