ఉత్సాహంగా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
గద్వాలటౌన్: గెలుపు ఓటముల కంటే పోటీల్లో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం ప్రధానమని జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి (డీవైఎస్‌ఓ) జితేందర్ పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల కోసం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. గురువారం స్థానిక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో అండర్ –14, 16, 18, 20 విభాగాలలో బాలురు, బాలికలకు వేరువేరుగా జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వమించారు. 100 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంతో పాటు జావలిన్ త్రో విభాగాలలో క్రీడాకారులు పోటీపడ్డారు. జిల్లా వ్యాప్తంగా 150మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. డీవైఎస్‌ఓ జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఎంపికై న వారందరూ ఈ నెల 23వ తేదీలలో హైదరాబాద్‌లోని కొల్లూరులో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొంటారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బీసన్న, సతీష్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో పీఈటీలు నగేష్‌బాబు, విజయ్, అమరేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


