
ఆర్‌ఓ చేతులమీదుగా ధ్రువీకరణ పత్రంఅందుకుంటున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల రూరల్: రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగినా.. గద్వాలలో మాత్రం ఫలితం అందుకు భిన్నంగా వచ్చింది. నియోజకవర్గ ప్రజలు రెండోసారి బీఆర్‌ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికే జైకొట్టారు. కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి, జెడ్పీ చైర్‌పర్సన్ సరితపై బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి 7,036 ఓట్ల మెజార్జీ సాధించారు.
ఆది నుంచి ఆధిక్యంలోనే..
ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభించినప్పటి నుంచి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆధిక్యంలో దూసుకెళ్లారు. ధరూర్ మండలం నుంచి ప్రాంరంభమైన లెక్కింపు ప్రక్రియ చివరిగా గద్వాల పట్టణం, మండలంతో పూర్తయింది. మొత్తం 2,56,605 ఓట్లకుగాను.. 2,13,274 ఓట్లు పోలయ్యాయి. 20 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 14 టేబుళ్లు, 22 రౌండ్లుగా విభజించి లెక్కింపు ప్రక్రియ చేపట్టారు.
● బీఆర్‌ఎస్ పార్టీకి గట్టు, కేటీదొడ్డి, ధరూరు మండలాల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థికి 9,111 ఓట్ల మెజార్టీ వచ్చింది. మల్దకల్ మండలంలో కాంగ్రెస్‌కు 965 ఓట్ల ఆధిక్యం రాగా.. గద్వాల మండలం, పట్టణంలో నువ్వా నేనా అన్న తరహాలో పోటీ నెలకొంది. ఇక్కడ 9,111 మెజార్టీ క్రమంగా తగ్గుతూ చివరకు 7,036 ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు.