గణపురం: గణపసముద్రం చెరువు కింద 3,850 ఎకరాలు అధికారికంగా.. అనధికారికంగా మరో నాలుగు వేల ఎకరాలు సాగవుతుంది. ప్రతి సంవత్సరం రెండు పంటలు సాగవుతున్నాయి. ఈ చెరువు కింద ప్రధానంగా కోట కాలువ, ఊటుకాలువ, మత్తడి కాలువ, కొత్తకాలువ, ఊళ్లే కాలువలు ఉన్నాయి. వీటి ద్వారా పంటలకు సాగునీరు అందుతుంది. ఆయకట్టు మొత్తం వరి సాగు ఎక్కువగా ఉండడంతో పొలాలు దున్నినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ప్రధాన కాలువలు ప్రతీ పంట సాగు సమయంలో మట్టితో కూడుకుపోయి, పిచ్చి మొక్కలు పెరిగి సాగు నీరు సరిగా అందని పరిస్థితి ఉంటుంది. ప్రతీ సారి లక్షల రూపాయలు పెట్టి నామమాత్ర పనులు చేసి వదిలేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ సంవత్సరం వర్షాలు కురవకపోవడంతో చెరువు నిండక వర్షాకాలం పంటనే పూర్తిస్థాయిలో సాగు కాలేదు. ప్రస్తుతం చెరువులో 20 అడుగుల నీరు మాత్రమే ఉండడంతో యాసంగి పంట సాగవడం కష్టంగానే ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం స్పందించి కాలువలకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
ప్రతి సారీ ఇబ్బందే..
రబీ, ఖరీఫ్ రెండు పంటలకు సాగు నీటి విషయంతో ప్రతి సారి ఇబ్బంది పడుతున్నాం. కాల్వల మరమ్మతు పనులు మీద మీద చేసి పోతున్నారు. పొలాలకు సాగునీరు సమృద్ధిగా అందేలా శాశ్వతంగా పనులు చేపట్టాలి.
– మాదాసు గురువయ్య,
గణపురం, రైతు


