కాళేశ్వరం: ప్రముఖ శైవక్షేత్రంగా పేరొందిన శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి దేవస్థానంలో పాలన గాడి తప్పుతోంది. దేవస్థానం పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు, అర్చక, సిబ్బంది వ్యవహారశైలి విమర్శలకు తావిస్తోంది. అర్చకులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. దీంతోపాటు పాలకవర్గానికి, ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ రగడపై ఆరోపణలు ఉన్నాయి.
మంత్రి చొరవతోనే..
రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో రూ.198 కోట్లతో కాళేశ్వరం దేవస్థానంలో పునర్నిర్మాణ పనులు చేపట్టగా.. ఏప్రిల్ 20న సీఎం రేవంత్‌రెడ్డి శంస్థాపన చేశారు. పాత ఆలయ నిర్మాణాలను తొలగించడంతో ప్రస్తుతం ఆదిముక్తీశ్వరాలయం వద్ద ఏర్పాటు చేసిన బాలాలయంలో ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. జూన్ 17న శృంగేరి పీఠాధిపతి శిష్యులు కళాప్రకర్షన చేసి బాలాలయంలో భక్తులకు దర్శనాలు కల్పించారు. జూలై 30 నుంచి పునర్నిర్మాణ పనులు జరుతుండగా.. ఆలయ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సమయపాలన ఏదీ?
దేవస్థానంలో అర్చకులు, సిబ్బంది విధులకు ఎప్పుడు వస్తున్నారు? ఎప్పుడు వెళ్తున్నారు? అనే విషయాలపై పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొంత మంది అర్చకులు మాత్రమే వస్తుండగా.. మరికొందరు సమయపాలన పాటించడం లేదు. దేవస్థానం ఈఓ ఉదయం 10 గంటలకు కార్యాలయానికి వచ్చి సాయంత్రం 5 గంటలకు వెళ్లిపోతున్నారని, సెలవు దినాలు తీసుకోవడంతో స్థానికులు, భక్తుల నుంచి ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయ వేళల అనంతరం ఆలయంలో జరిగే కార్యక్రమాలు, భక్తులకు అందుతున్న సేవలను పర్యవేక్షించేదెవరనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఆదాయం కూడా తగ్గుముఖం పట్టినట్లు తెలిసింది. జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ పోస్టు విషయంలో ఇద్దరు రికార్డు అసిస్టెంట్ల మధ్య పోటీ నెలకొంది. అధికారులు ఒకరికి సపోర్ట్ చేయడంతో ఇన్ని రోజులు సేవలందించినవారు అలిగినట్లు సమాచారం.
ప్రొటోకాల్ విస్మరణ..
దేవస్థానం పాలకవర్గం, ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ పాటించడంపై ఈఓ, సిబ్బంది విస్మరిస్తున్నారని తెలిసింది. విజయదశమి శమీ పూజలో ఈఓ గైర్హాజరు కావడంతోపాటు ప్రొటోకాల్ పాటించలేదని.. సర్పంచ్‌కు అర్చకుల మధ్య స్వల్పంగా వాగ్వాదం జరగడం గమనార్హం. పాలకవర్గానికి కనీస మర్యాద ఇవ్వడంలేదని వినికిడి. ఈవిషయం ఉన్నతాధికారులకు ఫిర్యాదు వరకు వెళ్లినట్లు తెలిసింది.
టెండర్ నిర్వాహకులకూ ఇబ్బందులే..
ఆలయ పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో టెండర్ నిర్వాహకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించలేదు. రేకుల షెడ్లు ఏర్పాటు చేసినప్పటికీ షట్టర్లు అమర్చలేదు.. విద్యుత్ సౌకర్యం కల్పించలేదు. దేవస్థానానికి ఆదాయం సమకూర్చే టెండర్ నిర్వాహకుల సమస్యల పరిష్కారంపై దేవాదాయశాఖ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
కాళేశ్వరంలో భక్తులకు తప్పని ఇబ్బందులు
అర్చకులు, సిబ్బంది సమయపాలనపై ఆరోపణలు
పాలకవర్గం, ప్రజాప్రతినిధులకు
ప్రొటోకాల్‌పై రగడ
టెండర్ నిర్వాహకులకు
సౌకర్యాలపైనా నిర్లక్ష్యమే..?
చర్యలపై దృష్టి సారిస్తేనే..
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవతో ఆలయ అభివృద్ధికి నిధులు సమకూర్చి పనులు చేపడుతున్న తరుణంలో క్షేత్రస్థాయిలో నిర్వహణ లోపాల ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఆలయ ప్రతిష్టకు భంగం కలగకుండా అధికారులు, అర్చకులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని భక్తులు కోరుతున్నారు. విధుల సమయాలను పర్యవేక్షించడం, భక్తులకు మెరుగైన సేవలు అందించడం, ప్రొటోకాల్ పాటించడం, టెండర్ నిర్వాహకులకు అవసరమైన సదుపాయాలు కల్పించడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రంలో పాలనపై వస్తున్న ఆరోపణలకు దేవస్థానం అధికారులు స్పందించి, వాస్తవ పరిస్థితులను వెల్లడించడంతోపాటు సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై దేవాదాయశాఖ వరంగల్ డిప్యూటీ కమిషనర్ కృష్ణప్రసాద్‌ను వివరణ కోరేందుకు ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు.
ఉన్నతాధికారులకు తెలియజేస్తా..
దేవస్థానం అధికారులు, అర్చకులు ప్రొటోకాల్ విస్మరించడం, సిబ్బంది సమయపాలన పాటించకపోవడం నాదృష్టికి వచ్చింది. పర్యవేక్షణలేమిపై దేవాదాయశాఖ ఉన్నతాధికారులు, మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకువెళ్తాను. ఆలయ ప్రతిష్టకు భంగం కలుగకుండా చర్యలు తీసుకుంటాను.
– అవధాని మోహన్ శర్మ,
కాళేశ్వరం దేవస్థానం చైర్మన్


