న్యూస్‌రీల్
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలో సింగరేణి సంస్థ నిర్మించిన అంబేడ్కర్ క్రీడా మైదానం సరైన నిర్వహణ లేక నిర్లక్ష్యానికి గురవుతోంది. నిత్యం వందలాది మంది వాకింగ్, జాగింగ్, వ్యాయామం కోసం వచ్చే ప్రజలతో పాటు క్రీడాకారులకు కనీస వసతులు కరువయ్యాయి. మైదానంలో చీకటిపడగానే మందుబాబుల హడావిడి ఎక్కువవుతోంది. సింగరేణి యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుండడంతో స్థానికులు, క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. స్టేడియంలో మౌలిక వసతులు కల్పించాలని, భద్రతాచర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
పచ్చదనం కాదు.. పిచ్చిమొక్కలే..
స్టేడియం గ్రౌండ్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. మైదానంలో పిచ్చిమొక్కలు, గడ్డి ఏపుగా పెరిగాయి. వాకింగ్ ట్రాక్ ఇరువైపులా, టెన్నిస్, హ్యాండ్‌బాల్ కోర్టుల పరిసరాల్లో మొక్కలు నిలువెత్తుగా పెరగడంతో వాకర్లు, క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామునే మహిళలు, యువత, కార్మికులు, వారి కుటుంబసభ్యులు వాకింగ్, జాగింగ్, వ్యాయామం కోసం స్టేడియానికి వస్తున్నారు. మైదానం శుభ్రంగా లేకపోవడంతో పాములు, విషపురుగులు, ఇతర కీటకాలు సంచరిస్తాయేమోనని భయపడుతున్నారు. కుక్కలు, పందులు స్వైర విహారం చేస్తున్నారు. క్రమం తప్పకుండా గ్రౌండ్‌ను శుభ్రం చేసి క్రీడలకు అనుకూలంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు.
సెక్యూరిటీ.. కనిపించదు!
సింగరేణి ఆస్తులు, భవనాల పరిరక్షణకు సెక్యూరిటీ విభాగం నిఘా ఏర్పాటు చేస్తుంది. కానీ అంబేడ్కర్ స్టేడియం, సీఈఆర్ క్లబ్ వంటి ప్రాంతాల్లో తగిన
భద్రతా సిబ్బంది లేకపోవడంతో ఆకతాయిలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇప్పటికై నా పట్టించుకుంటారా..
అంబేడ్కర్ స్టేడియం కేవలం సింగరేణి కార్మికులకే కాకుండా జిల్లా ప్రజలకు ఉపయోగపడుతున్న ప్రధాన క్రీడా వేదిక. ఇలాంటి ప్రాంగణాన్ని నిర్లక్ష్యంగా వదిలేయడంతో క్రీడాకారుల సాధనతోపాటు ప్రజల ఆరోగ్యకరమైన జీవనశైలికి కూడా ఇబ్బంది కలుగుతోందని పలువురు అంటున్నారు. పిచ్చిమొక్కలను తొలగించడం, మైదానాన్ని శుభ్రపరచడం, ఆర్‌ఓ ప్లాంట్‌ను వెంటనే పునరుద్ధరించడం, అవసరమైన క్రీడా పరికరాలు, సౌకర్యాలు కల్పించడం, సెక్యూరిటీ సిబ్బందిని నియమించడం వంటి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. సింగరేణి యాజమాన్యం స్పందించాలని కోరుతున్నారు.
●


