ఫిర్యాదులపై నిర్లక్ష్యం ప్రదర్శించొద్దు | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులపై నిర్లక్ష్యం ప్రదర్శించొద్దు

Sep 29 2026 1:15 AM | Updated on Sep 29 2026 1:15 AM

● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌

భూపాలపల్లి: ప్రజల ఫిర్యాదుల పట్ల పోలీసు అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ సూచించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్‌ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 15మంది నుంచి ఎస్పీ నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజాదివస్‌కు వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చట్టబద్ధమైన విధానంలో ప్రతీ ఒక్కరికి న్యాయం అందించేందుకు పోలీసుశాఖ కట్టుబడి ఉందన్నారు.

మత్తు పదార్థాలు లేని దేశంగా మార్చాలి

భూపాలపల్లి అర్బన్‌: నశాముక్త భారత్‌ (మత్తు పదార్థాలు లేని భారతదేశం) నిర్మాణంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ దేవేందర్‌ తెలిపారు. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి రోహిణి, ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పరుశరాంపల్లి గ్రామ

తరలింపునకు సానుకూలం

గణపురం: మండలంలోని పరుశరాంపల్లి గ్రామం తరలింపునకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు సానుకూలంగా స్పందించినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. సోమవారం గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు వారికి వినతిపత్రం అందించారు. ఓసీ–3లో రైతులు సాగుభూములు కోల్పోవడంతో పాటు బ్లాస్టింగ్‌ కారణంగా ఇళ్లకు పగుళ్లు ఏర్పడి నివాసాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. కాలుష్యం కారణంగా గ్రామస్తులు అనారోగ్యాలకు గురవుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గ్రామాన్ని తరలించేందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

దరఖాస్తుల స్వీకరణ

భూపాలపల్లి రూరల్‌: జిల్లా స్థాయి విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ ఎస్సీ, ఎస్టీ కమిటీ సభ్యత్వం కోసం షెడ్యూల్డ్‌ తెగల అసోసియేషన్‌ లేదా ఆర్గనైజేషన్‌ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి కుమారస్వామి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్టోబర్‌ 9వ తేదీ వరకు దరఖాస్తులను జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ది కార్యాలయంలో అందించాలని చెప్పారు.

హోంవర్క్‌ చేయలేదని విద్యార్థినిని కొట్టిన టీచర్‌

భూపాలపల్లి అర్బన్‌: హోంవర్క్‌ చేయలేదనే కారణంతో జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినిని టీచర్‌ కర్రతో కొట్టినట్లు విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపారు. గాయమైన చేయి కమిలిపోయిందన్నారు. గమనించిన క్లాస్‌ టీచర్‌ జండుబాంబ్‌ రాసినట్లు, పాఠశాల డ్రైవర్‌ సైతం తనతో దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు విద్యార్థిని ఆరోపించింది. ఈ ఘటనపై సమగ్రంగా విచారణజరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

‘అపోహలు సృష్టించడం సరికాదు’

భూపాలపల్లి రూరల్‌: రాజకీయాలకోసం ప్రజల్లో అపోహలు సృష్టించడం సరికాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషీధర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలు రాజకీయ దుష్పచ్రారంలో భాగమన్నారు. ఆరోపణలకు ఆధారాలు, పత్రాలను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement