భూపాలపల్లి: వయోవృద్ధుల అనుభవాలు, సలహాలు జిల్లా అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. సోమవారం భూపాలపల్లి పట్టణంలోని వయోవృద్ధుల డే కేర్ సెంటర్, అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి, సౌకర్యాలు, రోజువారీ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 24 నుంచి అక్టోబరు 1 వరకు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్ల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డే కేర్ సెంటర్ వయోవృద్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కేంద్రంలో భోజన సౌకర్యంతో పాటు ఆటలు, పరస్పర చర్చలకు అనుకూలమైన వాతావరణం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అత్యవసర సేవల కోసం వయోవృద్ధులు 14567 కంట్రోల్ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి, డీపీఆర్‌ఓ ఎస్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం..
గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాహుల్‌శర్మ వెల్లడించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యాశాఖ కార్యదర్శులతో కలిసి ఆయన కలెక్టర్లతో విద్యార్థుల వసతి, సంక్షేమం, విద్యా ప్రమాణాలు, విద్యాసంస్థల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.
ప్రజ్ఞను అభినందించిన కలెక్టర్..
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన రాష్ట్రస్థాయి పాటల పోటీల్లో భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని కమ్మల ప్రజ్ఞ పాటల పోటీల్లో తృతీయ స్థానం సాధించడం పట్ల కలెక్టర్ రాహుల్ శర్మ అభినందించారు. ప్రజ్ఞ జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్‌ను కలువగా అభినందించి ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించాలి..
ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 81 దరఖాస్తులు అందినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


