ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి రూరల్: స్వాతంత్య్ర పోరాటం, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ మూడు తరాల ఉద్యమ నేతగా చిరస్మరణీయులని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఆదివారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐడీఓసీలో ఘనంగా నిర్వహించారు. మంజూరునగర్‌లోని బాపూజీ విగ్రహానికి ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, అధికారులు, బీసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ బాపూజీ నిజాయితీ, నిస్వార్ధతకు ప్రతీకగా నిలిచారని స్పష్టం చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు విశేష సేవలందించారని తెలిపారు. రాష్ట్ర సాధనకోసం మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమించడం ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు. తెలంగాణ కోసం ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన మహనీయుడని పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు, సిద్ధాంతాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, ఆర్డీఓ హరికృష్ణ, కౌన్సిలర్ అప్పం కిషన్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు క్యాతం సతీశ్, ఎలగొండ రాజేంద్రప్రసాద్, సత్యనారాయణ, గూట్ల తిరుపతి, కృష్ణమోహన్, అడ్డగట్ల శ్రీధర్, భాగవతం భిక్షపతి, కూచన కిషన్ ప్రసాద్ పాల్గొన్నారు.
మహోన్నత వ్యక్తి
భూపాలపల్లి అర్బన్: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజా సేవకు, సామాజిక న్యాయానికి అంకితమైన మహోన్నత వ్యక్తి అని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. బాపూజీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎస్పీ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. స్వాతంత్యోద్యమంతోపాటు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన ఆశయాలు, సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం కోసం బాపూజీ చేసిన కృషిని స్మరించుకోవడం ఆయనకు అందించే నిజమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, ఆర్‌ఐ రత్నం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


