భూపాలపల్లి అర్బన్: సింగరేణి సంస్థను పరిరక్షించడంతో పాటు కార్మికుల హక్కులు, సంక్షేమాన్ని కాపాడేందుకు సంఘటితంగా ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం టిబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య అధ్యక్షతన నిర్వహించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి గండ్ర ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ, కార్మికుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, కోర్టు తీర్పు అనంతరం ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతుందనే ఆశాభావం వ్యక్తంచేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కార్మికుల సమస్యలపై పోరాడేందుకు టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్మికులను సమీకరించి వారి సమస్యలు, హక్కులు, సంక్షేమ అంశాలపై నిరంతరం పోరాటం చేయాలని సూచించారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల సింగరేణిలోని మూడు గనులను సందర్శించినప్పుడు కార్మికులు తమ సమస్యలను వివరించారని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి


