● జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షం
● వరిపొలాలకు జీవం
● ఆనందంలో రైతాంగం
భూపాలపల్లి రూరల్: బుధవారం నుంచి శుక్రవారం ఉదయం వరకు జిల్లా అంతటా ముసురుతోపాటు జోరుగా వాన కురిసింది. జిల్లాలో 1,09,442 ఎకరాల్లో పత్తి, 99,779 ఎకరాల్లో వరి ప్రధాన పంటలను సాగు చేశారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా జిల్లా వ్యాప్తంగా సరైన వర్షాలు లేవు. ఫలితంగా పత్తిచేలు పిందె దశలో సరైన ఎదుగుదల లేని కారణంగా వాడిపోయే దశలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పూత పూసి కాయదశకు చేరుకున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో పత్తి పగిలి ఏరే దశలో ఉంది. ప్రస్తుతం కురిసిన వర్షాలు కొనఊపిరిలో ఉన్న పత్తి చేలకు జీవం పోసినట్లయింది. ఎండిపోతున్న పంటలకు కూడా మేలు జరిగింది. ఈ సీజన్‌లో తక్కువ వర్షాలు కురుస్తున్నందున పెట్టిన పెట్టుబడులు కూడా చేతికొచ్చే పరిస్థితి కనబడటంలేదని ఆవేదన చెందుతున్న తరుణంలో బుధవారం నుంచి శుక్రవారం వరకు కురిసిన వర్షంతో రైతులు ఆనంద పడుతున్నారు. చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మూడు మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా గణపురం, భూపాలపల్లి, కాటారం, మహదేవపూర్ మండలాల్లో నమోదైంది. మిగితా మండలాల్లో మోస్తారుగా కురిసింది. వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భూపాలపల్లి అర్బన్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా ఏరియాలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. గురువారం మధ్యాహ్నం నుంచి బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీత పనులు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా మోస్తారు వర్షం కురుస్తుంది. దీంతో ఏరియాలోని కేటీకే ఓపెన్ కాస్ట్–2, 3 ప్రాజెక్ట్‌లలో పని స్థలాల వద్ద వరద నీరు చేరింది. రోడ్లు పూర్తిగా బురదమయమయ్యాయి. దీంతో బొగ్గు, మట్టి వెలికితీత పనులు పూర్తిగా నిలిచిపోయాయి. రెండు రోజుల్లో కలిసి సుమారు 10వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. గనుల్లోకి చేరిన వరద నీటిని భారీ మోటార్ల సహాయంతో బయటకు పంపిస్తున్నారు.


