28నుంచి ఎస్‌జీఎఫ్‌ క్రీడలు | - | Sakshi
Sakshi News home page

28నుంచి ఎస్‌జీఎఫ్‌ క్రీడలు

Sep 26 2026 1:14 AM | Updated on Sep 26 2026 1:14 AM

భూపాలపల్లి అర్బన్‌: ఈ నెల 28వ తేదీ నుంచి జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ (స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌) ఆధ్వర్యంలో అండర్‌–14, అండర్‌–17 బాలబాలికల జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి లావుడ్య జయపాల్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక అంబేడ్కర్‌ స్టేడియంలో పీఈటీ, పీడీ ఉపాధ్యాయులతో కోఆర్డినేషన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌, ఏర్పాట్లపై చర్చించారు. ఈ నెల 28న అండర్‌–14 బాలబాలికలకు, 29న అండర్‌–17 బాలబాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల నిర్వహణ కోసం వివిధ విభాగాలకు ఇన్‌చార్జ్‌లను నియమించినట్లు వివరించారు. ఈ సమావేశంలో డీవైఎస్‌ఓ సీహెచ్‌ రఘు, పేటా సంఘం అధ్యక్షుడు ఎస్‌.రమేశ్‌, సీనియర్‌ పీడీ టి.రాజయ్యతో పాటు జిల్లాలోని పీఈటీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

దివ్యాంగ చిన్నారులతో జడ్జి ఆత్మీయ పలకరింపు

భూపాలపల్లి అర్బన్‌: ప్రపంచ బధిరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని దివ్యాంగ పిల్లల పాఠశాలను సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి తాడూరు మహతి వైష్ణవి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న చిన్నారుల స్థితిగతులు, విద్యాబోధన, వారికి అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. పిల్లల సంక్షేమానికి అవసరమైన సహాయం లేదా న్యాయపరమైన సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని పాఠశాల నిర్వాహకులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించి ప్రపంచ బధిరుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులకు చాక్లెట్లు, పండ్లు పంపిణీ చేశారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు రాజయ్య, రజిత, మెడికల్‌ ఆఫీసర్‌ రుచిత, ఏఎన్‌ఎం స్వప్న, న్యాయ సేవాధికార సంస్థ సూపరింటెండెంట్‌ రఘురాం, సిబ్బంది అంబాల దేవేందర్‌, గోపాల్‌, రమేశ్‌, రాజకుమార్‌ పాల్గొన్నారు.

సమన్వయంతో

విజయవంతం చేయాలి

రేగొండ: పర్యాటక దినోత్సవాన్ని అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి అన్నారు. మండలంలోని పాండవుల గుట్టల వద్ద నిర్వహించనున్న ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యక్రమానికి వచ్చే సందర్శకులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి రఘు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement