● ఎమ్మెల్యే గండ్ర
సత్యనారాయణరావు
భూపాలపల్లి రూరల్: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, సింగరేణి సంస్థ ఆర్థిక వ్యవస్థలను విధ్వంసం చేసిందే బీఆర్‌ఎస్ నాయకులని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కుటుంబ సభ్యులు కమీషన్ల కోసం వ్యవస్థలను విచ్ఛిన్నం చేశారన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వర్షభావ పరిస్థితులు ఉన్నాయని, దీనిని ఆసరాగా చేసుకొని బీఆర్‌ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ జెన్‌కో ముందు ధర్నాలు చేసి రైతులను, ప్రజలను తప్పు తోవ పట్టిస్తున్నారన్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీరు తగినంత లేకపోవడంతో విద్యుత్ ఉత్పాదన తగ్గిందనేది అందరికీ తెలిసిందేనన్నారు. అయినా కూడా ఇప్పటి వరకు అధికారులు కోతలు లేకుండా రైతులకు, గృహాలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నారన్నారు. చెల్పూరు జెన్‌కోలో 500, 600 మెగా వాట్ల యూనిట్లను ప్రారంభించింది దివంగత నేత వైస్ రాజశేఖర్‌రెడ్డి అని గుర్తుంచుకోవాలన్నారు. 800 యూనిట్లను కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంజూరు చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టునుంచి ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలకు నీటి బొట్టు కూడా అందించలేదన్నారు. సింగరేణిలో కార్మికుల పేర్ల మార్పు, మెడికల్ బోర్డు ఏర్పాటుపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చిస్తున్నాడన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


