గోలీ మింగడానికి నీళ్లేవి? | - | Sakshi
Sakshi News home page

గోలీ మింగడానికి నీళ్లేవి?

Sep 22 2026 12:54 AM | Updated on Sep 22 2026 12:54 AM

చిట్యాల సివిల్‌ ఆస్పత్రిలో

ఆరు నెలలుగా కష్టాలు

ఆస్పత్రిలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ రిపేరులో ఉంది. గతంలో చెడిపోతే రూ.30వేలు ఖర్చు పెట్టి మరమ్మతు చేయించాం. మళ్లీ రిపేర్‌కు వచ్చింది. ప్రస్తుతం బడ్జెట్‌ లేదు. వాటర్‌ ప్లాంట్‌ సర్వీస్‌ సెంటర్‌ వాళ్లు ఇచ్చిన ఎస్టిమేషన్‌ను కమిషనర్‌కు పంపించాం. అవి రాగానే రిపేర్‌ చేపిస్తాం. ఆస్పత్రికి వచ్చే హెచ్‌డీఎస్‌ బడ్జెట్‌ కూడా రెండున్నరేళ్లుగా రావడం లేదు. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు.

– డాక్టర్‌ శ్రీకాంత్‌, చిట్యాల సివిల్‌ ఆస్పత్రి

ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌

బడ్జెట్‌ లేదు..

చిట్యాల: మండలకేంద్రంలోని సివిల్‌ ఆస్పత్రిలో ఆరు నెలలుగా తాగునీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆస్పత్రిలోని మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ మరమ్మతుకు గురవడంతో రోగులు, వారి సహాయకులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన వారు డాక్టర్లు ఇచ్చిన గోలీలు మింగడానికి కూడా తాగునీరు లేని పరిస్థితి ఉంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సమస్య ఆరు నెలలుగా ఉన్నా ఆస్పత్రి బాధ్యులు, పాలకులు, అధికారులు ఎవరూ పట్టించుకున్న పాపానపోవడం లేదు.

నెల క్రితం కలెక్టర్‌ సమీక్ష..

నెల రోజుల క్రితం కలెక్టర్‌ రాహుల్‌శర్మ చిట్యాల సివిల్‌ ఆస్పత్రిని సందర్శించారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యం, సౌకర్యాలను తెలు సుకున్నారు. అనంతరం వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కానీ ఇప్పటివరకు తాగునీటి సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు. ఇప్పటికై నా కలెక్టర్‌ స్పందిస్తే ఆస్పత్రికి వచ్చే నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు తాగునీటి సమస్య తీరుతుంది.

రోజూ వందకుపైగా ఓపీ..

చిట్యాల సివిల్‌ ఆస్పత్రికి మండలంలోని 20 గ్రామాల నుంచే కాక చుట్టుపక్కల మండలాలైన టేకుమట్ల, మొగుళ్లపల్లి, రేగొండ నుంచి కూడా అనారోగ్యానికి గురైన వారు వస్తుంటారు. ప్రతి రోజూ ఓపీ వందకు పైగానే ఉంటుంది. అనారోగ్యానికి గురైన వారు ఆస్పత్రిలో అడ్మిట్‌ అయి నాలుగైదు రోజులు కూడా చికిత్స పొందుతుంటారు. కానీ ఆస్పత్రిలో కనీస మౌలిక సదుపాయాలు లేక రోగులు, సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరు నెలలుగా తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్లు ఇచ్చిన గోలి వేసుకుందామంటే తాగునీరు లేక మండలకేంద్రంలోని చౌరస్తాకు వెళ్లి కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి ఆస్పత్రిలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు.

ఇబ్బందులు పడుతున్న రోగులు,

అటెండర్లు

తప్పనిసరి పరిస్థితుల్లో

బయట కొనుగోలు

పట్టించుకోని అధికారులు, పాలకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement