చట్టబద్ధంగా ప్రతీ ఒక్కరికి న్యాయం | - | Sakshi
Sakshi News home page

చట్టబద్ధంగా ప్రతీ ఒక్కరికి న్యాయం

Sep 22 2026 12:54 AM | Updated on Sep 22 2026 12:54 AM

● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌

భూపాలపల్లి: చట్టబద్ధంగా ప్రతీ ఒక్కరికి న్యాయం అందేలా చూడటమే తమ కర్తవ్యమని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా దివస్‌ కార్యక్రమం నిర్వహించి 16మంది నుంచి ఎస్పీ నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసుశాఖ సేవలను పొందేందుకు పైరవీలు, మూడవ వ్యక్తి ప్రమేయం అవసరం లేదన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పరిష్కారం కాని సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ప్రజా దివస్‌ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.

గణపురం

పోలీస్‌స్టేషన్‌ తనిఖీ

గణపురం: గణపురం పోలీస్‌స్టేషన్‌ను అదనపు ఎస్పీ నరేష్‌కుమార్‌ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌ స్టేషన్‌లో రికార్డులు, పెండింగ్‌ కేసుల దర్యాప్తు పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, పోలీస్‌స్టేషన్‌ నిర్వహణ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. పెండింగ్‌ కేసుల దర్యాప్తులను వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించేందుకు ప్రతీ ఒక్కరు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

సమస్యలు పరిష్కరించాలి

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, వాటి అమలుకు స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం (టీఎస్‌యూఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య కోరారు. సోమవారం ఏరియాలోని యూనియన్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడేళ్లుగా ప్రతీ అసెంబ్లీ సమావేశంలో కోల్‌బెల్ట్‌ ప్రాంత ఎమ్మెల్యేలు కార్మికుల హక్కులు, సమస్యలపై చర్చిస్తున్నప్పటికీ వాటిలో అనేకం అమలుకు నోచుకోవడం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రాష్ట్రంలో అమలు చేయకూడదని అన్నారు. ఈ సమావేశంలో టీఎస్‌యూఎస్‌ నాయకులు దాసరి జనార్దన్‌, కాసర్ల ప్రసాదరెడ్డి, గొడిశెల శ్రీహరి, నామాల శ్రీనివాస్‌, రాళ్లబండి బాపు, సాజిత్‌, లక్ష్మినారాయణ పాల్గొన్నారు.

పరికరాలు

అందుబాటులో ఉంచాలి

భూపాలపల్లి అర్బన్‌: ఏరియాలోని సింగరేణి గనుల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను యాజమాన్యం తక్షణమే పరిష్కరించి, పనిముట్లను అందుబాటులో ఉంచాలని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) బ్రాంచ్‌ సెక్రటరీ మోటపలుకుల రమేశ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏరియాలోని అన్ని గనుల మేనేజర్లకు కార్మికుల సమస్యలతో కూడిన వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రమేశ్‌ మాట్లాడుతూ.. గనుల్లో పనిచేస్తున్న కార్మికులకు అవసరమైన రక్షణ పరికరాలు, పనిముట్లు, ఇతర సౌకర్యాలు సక్రమంగా అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కార్మికుల భద్రత విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు గురిజేపల్లి సుధాకర్‌రెడ్డి, గంగసారం శ్రీనివాస్‌, నూకల చంద్రమౌళి, సదానందం, ఎండీ ఆసిఫ్‌ పాషా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement