గణపురం: మండలకేంద్రంలోని గణపసముద్రం చెరువులో వినాయక నిమజ్జన ఏర్పాట్లను డీఎల్‌పీఓ మల్లికార్జున్‌రెడ్డి శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తులకు అసౌకర్యం కలగకుండా నిమజ్జన ప్రదేశం వరకు తాత్కాలిక రోడ్డును ఏర్పాటు చేయాలని, డయాస్, బారికేడ్లు, విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్యం వంటి పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఎస్సై మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీకాంత్, సర్పంచ్ కట్కూరి రాధిక, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
అక్టోబర్ 4న
రెడ్‌క్రాస్ ఎన్నికలు
భూపాలపల్లి అర్బన్: అక్టోబర్ 4వ తేదీన రెడ్‌క్రాస్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా సహకార సంఘాల అధికారి వాల్యానాయక్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెడ్‌క్రాస్ చైర్మన్, వైస్ చైర్మన్, కోశాధికారి, ఆఫీస్ బేరర్స్, రాష్ట్ర కమిటీ సభ్యుల ఎన్నికలకు శనివారం రెడ్‌క్రాస్ ఓటర్ జాబితా విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నెల 24న నామినేషన్, 25న స్కూటినీ, 26న విత్‌డ్రాలు, అభ్యర్థుల బాబితా విడుదల చేయనున్నట్లు చెప్పారు. అక్టోబర్ 4 ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను
కొనసాగించాలి
టేకుమట్ల: గ్రామాల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను కొనసాగించాలని డీఎస్పీ సంపత్‌రావు పోలీసులకు సూచించారు. శనివారం పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. అనంతరం స్టేషన్‌లో పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమస్యాత్మక గ్రామాల్లో నిత్యం పోలీసుల నిఘా పెట్టాలన్నారు. శాంతిభదత్రల రక్షణకు నిరంతరం కృషిచేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. ఆయన వెంట చిట్యాల సీఐ సతీశ్, ఎస్సై అమూల్య ఉన్నారు.
నీటి సమస్యకు
శాశ్వత పరిష్కారం
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు శాశ్వత చర్యలు చేపడుతున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరత్నం తెలిపారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ ఆదేశాల మేరకు మిషన్ భగీరథ అధికారులు శనివారం నీటి సరఫరా ఏర్పాట్ల కోసం స్థల పరిశీలన చేశారు. మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ నుంచి ఆస్పత్రికి నేరుగా నీటి కనెక్షన్ అందించేలా ప్రతిపాదిత మార్గాన్ని పరిశీలించారు. కనెక్షన్ పూర్తయితే ఆస్పత్రిలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు.


